ఆపరేషన్ ఆగదు.. యుద్ధం తప్పదు! .. కాల్పుల విరమణ కాదు.. విరామమే!

అనుకున్నదే  జరిగింది. అసలైన యుద్ధం మొదలయ్యేందుకు ముందే పాకిస్థాన్ చేతులు ఎత్తేస్తుందని, నిపుణులు చేసిన విశ్లేషణలు నిజమయ్యాయి. యుద్ధం వస్తే  పాకిస్థాన్ మూడు నాలుగు రోజులకంటే కంటే నిలబడలేదని చెప్పిన మాటలు నిజమయ్యాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్  ప్రకటించిన మూడు నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్  చేయగల్గినంతా చేసి  శనివారం (మే10)  కాళ్ళ బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో భారత్  తలుపు తట్టింది. ఆ దేశ డీజీఎంవో,మన డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. మన డీజీఎంవో షరతులతో అంగీకారం తెలిపారు. 

ఇదే విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్ర మార్గంలో మిలటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. 
అయితే.. అంతలోనే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒప్పందం కుదిరి నాలుగు గంటలు అయినా కాక ముందే  పాక్ మళ్ళీ కుక్క తోక వంకరని అన్నట్లు,ఉల్లంఘనలకు తెర తీసింది. దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్  దాడులకు పాల్పడింది.  షరా మాములుగా మన సేనలు, పాక్  డ్రోన్లను తుక్కును కొట్టి నట్లు కొట్టి పడేశాయి అనుకోండి అది వేరే విషయం. 

కానీ, ఇక్కడ కూడా మరో మారు విశ్లేషకుల మాట నిజం అయింది. కాల్పుల విరమణ వార్త వచ్చిన తర్వాత ఏటీవీ చానల్ తెరిచినా  పాక్  కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా.. మళ్ళీ మాములుగా ఉల్లంఘనలకు పాల్పడుతుందా  అన్న అనుమానాలే వినిపించాయి. ఆ దేశ దుర్మార్గ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు, పాక్  ఉల్లంఘనలకు పాల్పడుతుందని అనుమానం లేకుండా స్పష్టంగా చెప్పారు. అయితే.. కొందరు మాత్రం  అనుమనాలు వ్యక్తం చేశారు. అయితే,ఎక్కువ నిరీక్షణ అవసరం లేకుండానే  పాక్  అనుమానాలను నిజం చేసింది. టీవీలలో చర్చ జరుగతున్న సమయంలోనే ఉల్లంఘన  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం సేథీ అవును  పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని, మీడియా సమావేశంలో చెప్పారు. 
నిజానికి అందుకు పెద్దగా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. పాక్ ,ఒప్పందానికి కట్టుబడితే ఆశ్చర్య పోవాలే కానీ, ఉల్లంగిస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే  అనేక మార్లు రుజు వైన పాక్  నైజం.

అయితే, పాక్  విషయాన్ని పక్కన పెట్టి మన విషయానికి వస్తే..  చాంతాడంత రాగం తీసి ఏదో పాట పాడి నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం  పూర్తి స్థాయి యుద్ధం మొదలవ్వక  ముందే ఓటమి అంచులకు చేరిన పాక్ తో  సంధి కి ఎందుకు అంగీకరించింది? పాకిస్థాన్   కాళ్ళ బేరానికి వచ్చిందంటే  కాల్పుల విరమణ కోసం ఎవరెవరి కాళ్ళో పట్టుకుంది అంటే, అర్థం చేసుకోవచ్చును. కానీ, భారత దేశం, కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఇది ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

 అలాగే  కాల్పుల విరమణ ఒప్పందం  పౌరోహిత్యం తమదే అంటూ జబ్బలు చర్చుకుంటున్న అమెరికా  గోలేంటి? నిన్నటి వరకు భారత్, పాక్ దేశాల మధ్య యుద్దమే వచ్చినా వేలు పెట్టేది లేదని అంటూ వచ్చిన పెద్దన్న ట్రంప్  ఇప్పుడు, ఇలా  నాలుక మడతేసి అంతా  తామే చేశామని చెప్పుకోవడం వెనక ఉన్న మతలబు ఏమిటి? ఇందులో పాక్  కు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించిన,  ఐఎంఎఫ్   పాత్ర ఏమిటి? అంటే.. ప్రస్తుతానికి ఎవరి వద్ద సరైన అమాధానం లేదు.  అయితే..  ట్రంప్ .. క్రెడిట్  తమ ఖాతాలో కలుపుకున్నా, మన దేశం మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మూడో దేశం(అమెరికా) పాత్ర లేదని కుండబద్దలు కొట్టింది. 

అలాగే.. కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి? వాటికి కూడా విరమణ షరతు వర్తిస్తుందా?అనే ప్రశ్నకు, అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణ ఒక్కటే షరతులకు లోబడి కుదుర్చుకున్న అంగీకారమని, సింధు జాలల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయం సహా దౌత్యపరమైన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్‌కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేనని ఆ వర్గాలు వివరించాయి.

 మిలటరీ యాక్షన్ సీజ్ చేసినప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో స్పష్టం చేశారు. కాల్పులు, మిలటరీ యాక్షన్‌పైనే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్న భారత విధాన నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు. సో.. కాల్పుల విరమణ ఒప్పందం అమలు అయినా కాకున్నా, ఉగ్రవాదాన్ని ఈ భూమి మీద ఎక్కడా లేకుండా చేయడమే లక్ష్యంగా మన దేశం ప్రారంభించిన ఆపరేషన్ సిదూర్  ఆగదు. యుద్ధం తప్పదు. ప్రస్తుత కాల్పుల విరమణ .. విరమణ కాదు, విరామం మాత్రమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu