క్షమించు దీదీ.. మమతా బెనర్జీకి మాజీల వినతి
posted on May 24, 2021 12:50PM
పశ్చిమ్ బెంగాల్లో సీన్ రివర్స్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్యూకట్టి కమలదళంలో చేరిన తృణమూల్ నాయకులు, ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ పంచన చేరేందుకు సిద్డంవుతున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అందరూ కాకపోయినా, కొందరు, ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్ల్యేలు, అలాగే, ద్వితీయ శ్రేణి నాయకులు తొందరపడితప్పు చేశామనే ఆలోచనకు చేరుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తప్పు ఒప్పుకుని దీదీకి దాసోహం అనేందుకు సైతం సిద్డమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి లేఖ రూపంలో అభ్యర్ధన పంపారు. తప్పు చేశానని తొందర పడ్డానని ఒప్పుకుంటూ, ప్లీజ్, దయచేసి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, మీకు, పార్టీకి విధేయంగా ఉంటాను, పార్టీ అభివృధికి కృషి చేస్తాను, అంటూ ఆమె ప్రాదేహపూర్వకంగా అభ్యర్దించారు.
సోనాలీ గుహ బాటలో ఇప్పుడు, మరో నాయకురాలు సరళా ముర్ముకూడా తనను కూడా తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ప్రాధేయ పూర్వకంగా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇచ్చిన హబీబ్పుర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక ఆమె, ఆఖరి నిముషంలో బీజేపీలో చేరారు. సొంత నియోజక వర్గం మాల్దా నుంచి పోటీ చేశారు. అయినా ఓడి పోయారు. దీంతో ఆమెకు జ్ఞానోదయం అయిందో ఏమో,తనను క్షమించాలని దీదీని కోరారు. బీజేపీలో చేరి తప్పు చేశానని, మళ్లీ ఇప్పుడు టీఎంసీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశమివ్వాలని అభ్యర్థించారు.అంతే కాదు, మమతా దీదీ దయతో తనను తిరిగి పార్టీలో చేర్చుకుంటే, చేసిన తప్పు దిద్దుకుని దీదీతో కలిసి పనిచేస్తాననిం ముర్ము స్పష్టం చేశారు.
ఈ రివర్స్ వరద ఎంతవరకు వెళుతుందనే విషయంలో, ఎవరి అంచనాలు వారికున్నాయి. నిజానికి బీజేపీ ఈ పరిణామాన్ని ముందుగానే గమనించింది. అందుకే, నారద కుంభకోణం కేసును తెరమీదకు తెచ్చింది. సెలెక్టివ్’గా తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి సహా, ఇతర నేతలను వదిలేసి, ఇద్దరు తృణమూల్ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, తృణమూల్ మాజీ నాయకుడు సోవన్ ఛటర్జీలను సీబీఐ అరెస్ట్ చేసింది.అంటే, బీజేపీలో చేరి మళ్ళీ మమత వైపు వెళ్ళే ఆలోచన చేస్తే,కేసులు, వేధింపులు, అరెస్టులు తప్పవని హెచ్చరిక చేసింది. ఆ విధంగా, రివర్స్ ఫిరాయింపులకు కొంత వరకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తోంది. మరో వంక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్’కు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఫిరాయింపుల జోరు ఉండక పోవచ్చును అని పరిశీలకులు భావిస్తున్నారు.
సోమవారం నారద కుంభకోణం కేసు సుప్రీం కోర్టుకు చేరింది.. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు, మరో ఇద్దరు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలన్న కోల్‌కతా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో మరో వంక సోమవారమే ఈ నలుగురు నేతల బెయిల్ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది.. ఇటు సుప్రీం కోర్టు అటు రాష్ట్ర హై కోర్టువిచారణలో ఉన్న ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడవలసి వుంది.