సంకెళ్లు తెంచుకున్న న్యాయం.. జగన్‌రెడ్డికి గుణపాఠం!
posted on May 24, 2021 12:50PM
అన్యాయానిది తాత్కాలికంగానే ఆధిపత్యం. శాశ్వత విజయం మాత్రం ఎప్పటికీ న్యాయానిదే. వేరు వేరు కేసుల్లో ధూళిపాళ్ల, రఘురామలకు బెయిల్ రావడం జగన్‌రెడ్డి సర్కారుకు చెంపపెట్టు లాంటిదే. టీడీపీ మౌత్‌పీస్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర నోరు మూయించేందుకే సంగం డెయిరీకి చెందని పాత ఎపిసోడ్‌ను తవ్వి.. నరేంద్రపై కొత్తగా కేసు పెట్టి.. కుట్ర చేశారనేది ప్రతిపక్షం ఆరోపణ. సంగం డెయిరీ ఆస్తులను మొత్తానికి మొత్తంగా స్వాధీనం చేసుకొని.. నరేంద్రను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసింది జగన్‌రెడ్డి సర్కారు. అమూల్‌ను రంగంలోకి దింపింది సంగం టార్గెట్‌గానే అంటారు.
అటు, రఘురామకృష్ణరాజు విషయంలోనూ ఇలానే జరిగింది. వైసీపీ ఎంపీగా గెలిచినా.. జగన్‌రెడ్డి విధానాలు నచ్చక.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చారు రఘురామ. తప్పులు సరికాదంటూ.. సరి చేసుకోమంటూ.. సలహాలు, సూచనలు చేయడమే రఘురామ చేసిన తప్పు. అందుకే, ఆయనపై జగన్‌రెడ్డి కక్ష కట్టారని చెబుతారు. కేవలం విమర్శలు చేసినందుకే, ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ.. రాజద్రోహం కేసు పెట్టి మరీ.. జైలుకు పంపించే కుట్ర చేశారని చెబుతారు.
విపక్షం ఆరోపిస్తున్నట్టుగా.. ఈ రెండూ కక్ష పూరిత కేసులే అనేది ప్రజల అభిప్రాయం. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనే కేసు పెట్టి వరకూ వచ్చారు ఈ పాలకులు. అయితే, ఎవరి ఫిర్యాదు మేరకైతే ఆ కేసు పెట్టారో ఆ ఫిర్యాదుదారులకే ఆ కేసు సంగతి తెలీక పోవడం విచిత్రం. ఫిర్యాదుదారుల సంభాషణ వీడియో రికార్డింగ్‌తో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ధూళిపాళ్ల నరేంద్రనే. అందుకే, జగన్‌రెడ్డి నరేంద్రను టార్గెట్ చేశారని చెబుతారు. చంద్రబాబుపై పన్నిన కుతంత్రానికి.. ధూళిపాళ్ల అడ్డుగా నిలుస్తున్నారని.. ఆయన్ను, ఆయనకు దన్నుగా ఉన్న సంగం డెయిరీని అడ్రస్ లేకుండా చేసేందుకు.. నరేంద్రపై కేసు పెట్టి.. అరెస్ట్ చేసి.. జైలుకు తరలించి.. పైశాచిక ఆనందం పొందారు. కానీ, కోర్టుల రూపంలో న్యాయం అనేది ఒకటి ఉంటుంది. అందుకే, సంగం డెయిరీ ఆస్తులను, కార్యకలాపాలను.. ప్రభుత్వ డెయిరీకి బదలాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. ఇక, కాస్త ఆలస్యమైనా.. ధూళిపాళ్లకు బెయిల్ రూపంలో న్యాయం జరిగింది.
అటు, రఘురామ ఎపిసోడ్ ఇంతకన్నా దారుణం. ఏకంగా నాన్‌బెయిలబుల్ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఉంది కాబట్టి సరిపోయింది. బెయిల్ వచ్చింది కాబట్టి.. న్యాయం నిలబడింది. లేదంటే.. రఘురామ పరిస్థితి ఎంత దారుణంగా ఉండిఉండేదో ఊహించుకోవచ్చు. ఆయన ఆరోపించినట్టు కస్టడీలోనే.. కాళ్లు కట్టేసి.. పాదాలు వాచేలా, కాలి వేలు ఎముక విరిగేలా కొట్టారంటే.. రఘురామతో ఎంత క్రూరంగా వ్యవహరించి ఉంటారో తెలుస్తోంది. ఇక, రఘురామ సతీమణి రమాదేవి ఆరోపించినట్టు.. జైలులోనే రఘురామను చంపేసినా ఆశ్చర్యం అవసరం లేదని అంటున్నారు.
ధూళిపాళ్ల అయినా, రఘురామ అయినా.. జస్ట్.. జగన్‌రెడ్డిపై విమర్శలు చేసినందునే.. కేసులు కట్టి, వేధించి, జైల్లో పెట్టడం.. నియంతృత్వ పోకడ కాక మరొకటి కాదు అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాలాంటి వాళ్లను సైతం టార్గెట్ చేశారు. ఎవరు నోరు మెదిపితే.. వారిని లోపలేస్తాం.. అన్నట్టు అరాచక పాలన కొనసాగిస్తున్నారు. పాలకులు ఎంత ప్రకోపం ప్రదర్శించినా.. చివరాఖరికి అంతిమ విజయం న్యాయానిదే. న్యాయస్థానాలు ఉన్నది అందుకే, ధూళిపాళ్ల, రఘురామలకు బెయిల్ రావడం.. జగన్‌రెడ్డి సర్కారుకు ఎదురుదెబ్బలే. నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎపిసోడ్ నుంచి.. నేటి ధూళిపాళ్ల, రఘురామ కేసుల వరకూ.. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి కోర్టు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా.. తల బొప్పి కడుతున్నా.. సర్కారు తీరు మారడం లేదు. తాజాగా, కర్నూల్ జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన జనార్ధన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి.. ఆయనపై ఎస్సీ, ,ఎస్టీ కేసులు పెట్టడం జగన్‌రెడ్డి ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం అని మండిపడుతున్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేకుండా.. అంతం చేయాలనే కుట్రలో జగన్‌రెడ్డి ఎన్నటికీ సఫలం కాలేరని సవాల్ విసురుతున్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ వల్లే కాలేదు. ఈయనెంత అంటున్నారు విపక్షనేతలు.