కోస్తాంధ్ర అలర్ట్.. దూసుకొస్తున్న యాస్..
posted on May 24, 2021 1:08PM
తౌక్తే పోయింది. యాస్ వచ్చింది. ఎండాకాలం తుఫానుల సీజన్‌గా మారింది. వరుసగా ఒకదాని తర్వాత మరొకటి తీరంపై దాడి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపైనా ఆ తుఫానుల ప్రభావం పడుతోంది. తెలంగాణ, ఏపీలో అకాల వర్షాలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు.
తాజాగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ‘యాస్’గా నామకరణం చేయబడిన తుఫాను.. పారాదీప్‌కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై.. క్రమంగా బలపడి తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫానుగా మారనుంది. ఈనెల 26వ తేదీన సాయంత్రం బాలాసోర్, సాగర్ దీవుల మధ్యలో తీరం దాటనుంది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది.
కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సోమవారం గాలుల తీవ్రత పెరిగిందని.. మత్య్సకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలను గుర్తించారు.
రానున్న 2 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, విజయనగరం నుంచి గుంటూరు వరకు అనేక మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 37.9 నుంచి 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి.
యాస్ తుఫాన్ ప్రభావంతో ఒడిసా, బెంగాల్‌లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. 46 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించగా, మరో 13 బృందాలను తరలించారు. సహాయక చర్యల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డు సిబ్బంది పాల్గొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్ మొత్తం 36 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. 57 టన్నుల సామాగ్రిని, 606 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని తరలించింది.
కాగా, తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్- నికోబార్ దీవుల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది.