తెలంగాణలో పాతలొల్లి.. ఎన్నికల వేళ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముంగిటకు వచ్చిన వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒక పాత పంచాయతీ సరికొత్తగా తెరమీదకు వచ్చింది. తెలంగాణ ఆవిర్భావానికి కారణం మేమంటే మేమంటూ మూడు పార్టీలూ  తెలంగాణ క్రెడిట్ ను, సెంటిమెంటును తమ ఖాతాలో వేసుకోవాలన్న విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 2014లో తెలంగాణ ఆవిర్భావానికి అప్పటి తెరాస, ఇప్పటి బీఆర్ఎస్ ఉద్యమమే కాకుండా, తెలంగాణ ఇవ్వాలన్న అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం, ఆ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీజేపీ మూడూ కారణమేనని పరిశీలకులు చెబుతున్నారు.

అన్నిటికీ మించి తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంతా రాజకీయ నాయకులంతా తెలంగాణ కోసం నిలబడటం కారణంగానే కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) అయినా, బీజేపీ అయినా మరెవరైనా సరే తెలంగాణ నినాదం ఎత్తుకోకుంటే రాజకీయంగా ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కనుకనే తెలంగాణ సాకారమైందన్నది మాత్రం వాస్తవం. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలో  తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత నాలుగేళ్లకు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు.

ఆ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్  విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన జాతీయ రాజకీయాలంటూ ఒక విధంగా నేల విడిచి సాము చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ పార్టీ చేసేశారు. దీంతో ఆయన   తెలంగాణ సాధించాను అని చెప్పుకునే అవకాశాన్ని ఈ ఎన్నికలలో చేజేతులా జారవిడుచుకున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి జన్మదిన కానుకగా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాలంటూ తెలంగాణ సెంటిమెంటును అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో అప్పట్లో పెద్దమ్మనే కాదు చిన్నమ్మనూ గుర్తుంచుకోండి అంటే కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా చేసిన వినతిని గుర్తు చేస్తూ అప్పటి విపక్షం బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లనే తెలంగాణ సాకారమైందనీ, తెరాస ఆవిర్భావానికి ముందే బీజేపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందనీ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు.

దీంతో ఇప్పుడు మూడు పార్టీలూ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మూడూ కూడా తెలంగాణ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? సాకారం చేసిందెవరు? అన్న ప్రచారంతో ప్రజల ముందుకు వస్తున్నారు.   ఈ ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఒకింత దూకుడు ప్రదర్శిస్తోంది. 1998 నుంచి  తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అలాగే అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్  సమైక్యత దినం అంటూ మాట మార్చారని విమర్శిస్తున్నారు.  ఏరకంగానైతే.. 15 ఆగస్టు, 26 జనవరి నిర్వహిస్తామో.. అలాగే సెప్టెంబర్ 17ను కూడా రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరపాల్సిన అవసరం ఉంది.   కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా  తెలంగాణ ఉత్సవాలు నిర్వహించామని కిషన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అంటున్నారు.  మొత్తం మీద రాష్ట్రంలో మూడు పార్టీలూ తెలంగాణ తెచ్చింది? ఇచ్చింది, సాకారం చేసింది మేమేనంటున్నారు. అయితే ప్రజలు ఏ పార్టీని విశ్వసిస్తున్నారు? తెలంగా ఆవిర్భావమై పదేళ్ల తరువాత అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షల గురించి కాకుండా ఇంకా సెంటిమెంటునే పట్టుకు వేళాడటాన్ని ప్రజలు ఎలా తీసుకుంటున్నారు అన్నది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.