ఉపరాష్టపతి రేసులో ఓబీసీ మహిళా నేత?
posted on Aug 12, 2025 1:22PM

జగదీప్ ధన్‌కఢ్ ఆకస్మిక రాజీనామాతో అనివార్యమైన భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం (ఆగష్టు 8) విడుదల చేసింది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంరంభ మైంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఆగష్టు 21తో ముగుస్తుంది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరుగుతుంది. అదే రోజున వోట్ల లెక్కింపు జరుగుతంది కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలెక్టోరల్ కాలేజీని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్దం చేసింది.
ఈ నేపథ్యంలో కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. నేడో రేపో ఎన్డీఎ కూటమి అభ్యర్ధి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో పేరు ప్రకటించినా ప్రకటించక పోయినా.. అంతర్గతంగా ఏకాభిప్రాయమ ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే.. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రుల స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అదే సమయంలో నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగులు వేస్తోందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ బాధ్యతలను కూడా నిర్వరించవలసి ఉంటుంది కనుక.. పార్లమెంట్ వ్యవహారాల్లో తగిన అనుభవం, విధివిధానాల పట్ల సంపూర్ణ అవగాహన అవసరం కనుక, ఇటు పార్లమెంట్ అనుభవంతో పాటుగా రాజకీయ చతురతతో పెద్దల సభను సమర్ధవంతగా నడపగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని అంటున్నారు. సమర్ధత, సామర్ధ్యంతో పాటుగా రాజకీయ జీవితంలో వివాదరహితునిగా పేరున్న పెద్ద మనిషిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు.. ఇంతవరకు ఎక్కడా వినిపించని, ఎవరూ ఉహించని, అదృశ్య వ్యక్తి ఒక్కసారిగా తెరపైకొచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు.
అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు ప్రస్తుత గవర్నర్లతో పాటుగా, ఒకరిద్దరు మాజీ గవర్నర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉపరాష్ట్రపతి రేసులో గుజరాత్ గవర్నర్. ఆచార్య దేవవ్రత్ అందరికంటే ముందున్నారు. అలాగే కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గహ్లోత్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథూర్ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ సిన్హా పేర్లు ప్రముఖగా వినిపిస్తునాయి.
అలాగే.. ఓబీసి వర్గానికి చెందిన మహిళ అయిన మాజీ ఎంపీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి.. నూతన ఉపరాష్రపతి పదవికి ప్రస్తుత లేదా మాజీ గవర్నర్ల లో ఒకరని ఎంపిక చేసే అవకా శాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. మహిళా సాధికరితకు ఎత్తు పీట వేస్తూ గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన విధంగా.. అదే ఒరవడిలో ఉపరాష్ట్రపతి పదవిని కూడా మహిళకు ఇవ్వలని భావిస్తే ఏమో కానీ.. లేదంటే గవర్నర్లలో ఒకరిని ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. కొస మెరుపుగా చివరకు మోదీ,షా మ్యామాజిక్ బాక్స్ లోంచి ఏ పేరు బయటకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.