ప్రకాష్ రాజ్ కి ఏపీలో ఏం పని?
posted on Aug 12, 2025 2:39PM
.webp)
నటుడు ప్రకాష్ రాజ్ కి ఏపీ.. సామాజిక- ఆర్ధిక- రాజకీయ పరిస్థితులపై అవగాహన అంతంత మాత్రం. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా అవస్థలు పడుతోంది. సరే ఎట్టకేలకు ఈ రాష్ట్రానికంటూ ఒక అవకాశమొచ్చిందని.. అమరావతే ఆ రాష్ట్ర రాజధాని అని సంబర పడేలోపు.. ఏ దుష్టకన్ను పడిందో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. జనం సొమ్ము పప్పుబెల్లాల్లా ఖర్చు చేసిన జగన్ తర్వాత అదే జనం చేత దారుణమైన పరాభవానికి లోనై ఘోరమైన ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్లలో కొందర్ని లాక్కుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని బాబును భయపెట్టిన జగన్ చివరికి ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. కర్మ రిటర్న్స్ థియరీకి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయారు.
ఇదంతా అలా ఉంచితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధానిని పునర్నించుకోవడంలో భాగంగా.. పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటూ.. వచ్చే రోజుల్లో ఎవరెన్ని చేసినా సరే.. ఇక్కడి నుంచి రాజధాని మార్చడానికి వీల్లేని విధంగా ఒక చట్టం తేవాలని నిర్ణయించింది. ఐదేళ్ల పాటు పనులు పడకేసిన పోలవరంతో పాటు, బనకరచర్లను సైతం నిర్మించే ఆలోచన చేస్తోంది చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఆపై విశాఖ ఉక్కును కాపాడుకోడానికి మొన్నటికి మొన్న 11500 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి పొందింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. మరెన్నో కంపెనీలను ఆంధ్రప్రదేశ్ బాటపడ్డానికి ముమ్మర యత్నాలు కొనసాగిస్తోంది బాబు నాయకత్వంలోని ప్రభుత్వం.
ఒక పక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచడానికి.. మరో పక్క సుదర్ఘ తీర ప్రాంతమైన ఏపీని అందుకు అనువుగా మార్చుకోడానికి.. చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తున్నది. ఒక వేళ జగన్ తిరిగి వస్తే పరిస్తితేంటని స్వయంగా పెట్టుబడి దారులు అడగటంతో ఆ భయాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్కడిన్ని సమస్యలుంటే ఎలాంటి మంత్రిత్వం చేసిన అనుభవం లేకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయ్యి.. ఆపై తన ఓట్ల కోసం.. స్వార్ధంతో కొందరికి ఎడా పెడా డబ్బులు పంచేసి.. ఆపై వారి ద్వారా కూడా సరైన ఆదరణకు నోచుకోక ఘోరంగా ఓడారు జగన్. ఇదంతా పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఏదో ప్రెజంటేషనన్ ఇచ్చారని చెప్పి.. పవన్ కళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ప్రకాష్ రాజ్ అవాకులు చవాకులు పేలుతున్నారు. నిజానికి ఆయనకున్న అభ్యంతరం సనాతన ధర్మం. బేసిగ్గానే ప్రకాష్ రాజ్ ఒక సెక్యులరిస్ట్. ఆయన బ్యాగ్రౌండ్ అలాంటిది. నేడు మోడీ అన్నా, బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా గిట్టక జస్ట్ ఆస్కింగ్ పేరిట పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ కాలయాపన చేస్తుంటారు ప్రకాష్ రాజ్.
ఇవాళ పవన్ కళ్యాణ్ రాజకీయంగా అన్ ఫిట్ అంటోన్న ప్రకాష్ రాజ్ తాను పుట్టిన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగని తన రాజకీయాలను ఆపక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ టాలెంట్ చూపించాలని ట్రై చేశారు. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసి అక్కడా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసిన పవన్ అన్న నాగబాబు ప్రకాశ్ రాజ్ కోసం ఎంత పోరాడినా ప్రకాశ్ రాజ్ మాత్రం మా ఎలెక్షన్లో నెగ్గలేక పోయారు. ఇప్పుడదే పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేస్కుని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ కన్నడ నటుడు. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని మొన్న దివంగతులైన కోట శ్రీనివాస్ పదే పదే చెప్పిన సంగతి ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
పవన్ ఇటీవల సనాతన ధర్మసారధిగా ప్రచారం మొదలు పెట్టడంతో.. ప్రకాష్ రాజ్ ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలాగుంటే.. రాహుల్ గాంధీ ప్రెజంటేషన్ అడ్డు పెట్టుకున్న ప్రకాష్ రాజ్ ఏపీలో కూటమి గెలిచిందంటే అందుకు కారణం ఈవీఎంగా చెప్పుకొస్తున్నారు. ఒక వేళ అదే నిజమైతే.. రాహుల్ గాంధీ డైరెక్ట్ గా ఏపీనే ఉదహరించేవారు కదా? మరలా ఎందుకు చేయలేదు? ఆయన మాటల్లో చేతల్లో ఎక్కడా ఏపీ ప్రస్తావన ఎందుకు లేదు? ఇదొక ప్రశ్న కాగా.. రాహుల్ గాంధీ కర్ణాటకలోని మహదేవ్ పుర అనే నియోజకవర్గం గురించి, ఆపై మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. తప్పితే ఎక్కడా ఏపీ వివరణ చేయలేదు. అంటే దీనర్ధమేంటి? ఇంత రీసెర్చ్ చేశానని చెబుతున్న రాహుల్ కి ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూటమి గెలిచినట్టు ఆధారాలు ఎక్కడా కనిపించలేదనేగా? కనీసం ఆయన ఏపీ విషయంలో ఫీలర్ కూడా ఇవ్వడం లేదు. దీనర్ధమేంటి? ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆయనకు కూడా ఆధారాలు లభించడం లేదనేగా?
ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ అంటే అసలు కడుపు మంట. ఇందాకే అనుకున్నట్టు.. ఆయన భుజానికెత్తుకున్న సనాతన ధర్మ పరిరక్షణ. ఈ విషయంలో నేరుగా టార్గెట్ చేయవచ్చు ప్రకాష్ రాజ్.. కానీ ఆయనలా చేయడం లేదు. ఇదే కమల్ హాసన్ సనాతన ధర్మానికి విరుగుడు విద్య అంటూ తాను కనీసం టెన్త్ కూడా పాస్ కాకుండానే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ వైల్డ్ గా రియాక్టయ్యాడు. కమల్ తల నరికేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో నేరుగా సనాతన ధర్మాన్ని అటాక్ చేయలేని ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ గెలుపుపై పదే పదే కామెంట్ చేస్తూ రెచ్చగొడుతున్నారు.