ఆలయాల్లో ప్రమాణాలు.. స్టాంప్ పేపర్ మీద బాండ్లు.. కొత్తపుంతలు తొక్కుతున్న కాంగ్రెస్ ప్రచారం!

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు, విశ్వసనీయత పొందేందుకు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. హామీలు ఇచ్చి విస్మరించే ప్రశక్తే లేదని నమ్మకంగా చెబుతోంది. ఇందు కోసం ఆ పార్టీ అభ్యర్థులు ఆలయాల్లో ప్రమాణాలు చేస్తున్నారు. స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని ప్రజలలో నమ్మకం కలిగేందుకు చేయగలిగినంతా చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అని కాకుండా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలో ఉన్న వారంతా ఆరుగ్యారంటీల అమలు పూచీ మాదేనని భరోసా ఇస్తున్నారు. ఇందు కోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాలలో ఆలయాలలో ప్రమాణం చేసి, ఆరుగ్యారంటీల అములు పూచీపడతామని బాండ్ పేపర్లపై రాసి సంతకాలు చేశారు. అయితే ఈ బాండ్లు చెల్లడం, చెల్లక పోవడం సంగతి పక్కన పెడితే ప్రజలలో కాంగ్రెస్ హామీలు అమలు చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించడాని ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది.  

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలూ ప్రజలను ఆకర్షించాయనడంలో సందేహం లేదు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలంగాణలో అధికార బీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా ప్రచారం చేశాయి. కర్నాటకలో కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందంటూ ఆరోపణలు గుప్పించాయి. దీంతో ప్రజలలో లేశమాత్రంగానైనా అనుమానం కలగకూడదన్న భావనతో కాంగ్రెస్ ఈ విధంగా ప్రమాణాలు, బాండ్ పేపర్లపై సంతకాల కార్యక్రమాన్ని చేపట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న కాంగ్రెస్, ఆ సానుకూల పరిస్థితులను మరింత పటిష్టం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్యారంటీలపై చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడానికే ఇలా ఆలయాలలో ప్రమాణాలూ, హామీల అమలుకు పూచి పడుతూ బాండ్ పైపర్లపై సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టిందని చెబుతున్నారు. ప్రచారగడువు ముగిసే చివరి రోజు బీఆర్ఎస్ మరిన్ని ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు దీటుగా ఎదురుదాడికి కూడా రెడీ అయ్యిందని అంటున్నారు.   రైతు బంధుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఎన్నికల సంఘం దానిని వెనుకకు తీసుకోవడానికి కారణం హరీష్ రావు కోడ్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా చేసిన ప్రసంగం, ప్రకటనే కారణమైనా, నెపాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్  రెడ్డిపై నెట్టేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.  కాంగ్రెస్  ఫిర్యాదు వల్లనే ఈసీ రైతుబంధుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసిందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎత్తి చూపుతున్నారు. రైతు బంధు అనుమతుల రద్దుకు ఎన్నికల సంఘం స్పష్టమైన కారణాన్ని తెలిపినా.. కాంగ్రెస్ రైతు ప్రయోజనాలకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారనీ, అందుకే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుందనీ   కేసీఆర్  సహా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈసీకి రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించింది. అయితే అది ఫేక్ అని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.  ఇలా కాంగ్రెస్ జోష్ కు బ్రేకులు వేయడానికి రానున్న రెండు రోజులలో బీఆర్ఎస్ మరిన్ని ఎత్తులు, వ్యూహాలతో చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తుందనీ,  అప్రమత్తంగా ఉండాలనీ రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ కు ఈ సారి సానుకూల వాతావరణం ఉండటంతో బీఆర్ఎస్ లో గుబులు మొదలైందని పరిశీలకులు అంటున్నారు.