కేసీఆర్, హరీష్ కు హైకోర్టులో చుక్కెదురు
posted on Sep 1, 2025 2:39PM
.webp)
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిలిపివే యాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న వారి విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు... మంగళవారం ఉదయం ఈ పిటిషన్ విచారణ చేపడతామని పేర్కొంది. అయితే అప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటి రోజే అంటే సోమవారం (సెప్టెంబర్ 1) కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.