కాళేశ్వరంపై రేవంత్ సేఫ్ గేమ్

 

కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించిన రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే… అవును అనే అంటున్నారు పరిశీలకులు…. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు. 

కమిషన్ నివేదిక రాగానే ఆలస్యం చేయకుండా క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆదివారం సెలవు దినం అయినా ఆఘమేఘాలపై అసెంబ్లీని సమావేశపరిచి కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఉపక్రమించారు. చర్చలో మంత్రులంతా మూకుమ్మడిగా విడివిడిగా బీఆర్ఎస్ పై దాడిచేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. 

అర్ధరాత్రి వరకు చర్చను నడిపి చివర్లో సీబీఐ విచారణకు ఆదేశించారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఆయన బాస్ రాహుల్ గాంధీ లు సీబీఐ అనేది కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు చేశారు. అదే కీలుబొమ్మ అని విమర్శలు గుప్పించిన సంస్థకే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించిన రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

 కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే అంతుతేలుస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.. బీజేపీ నేతల ప్రకటనలను అవకాశంగా తీసుకొని తను సేఫ్ గేమ్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. సీబీఐ విచారణలో అవకతవకలు గుర్తించి కేసీఆర్, హరీష్ లపై కేసులు నమోదు చేసి అరెస్టులకు దారితీస్తే తాను ఎవరినీ వేధించడం లేదని చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పవచ్చు… అదే సమయంలో తాను అనుకున్నది సాఫీగా తన చేతులకు మట్టి అంటకుండా జరిగిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. 

ఒకవేళ విచారణ సమయంలో జాప్యం జరిగినా తాను ఆశించినది  జరగకపోయినా బీజేపీ- టీఆర్ఎస్ లు ఒకటేననే ఆయుధాన్ని బయటకు తీసి రెండు పార్టీలను ఎండగట్టే అవకాశం తనకు ఎలాగూ ఉంటుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తనపైన కాంగ్రెస్ పార్టీపైన బీఆర్ఎస్- బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ విచారణ అంశం పనకివచ్చే  అవకాశముంది. ఎటుచూసినా బీజేపీ- బీఆర్ఎస్ లను ఇరుకున పెట్టే దిశగా రేవంత్ పావులు కదిపారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu