ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?.. బడ్జెట్లో కీలక హామీకి దక్కని చోటు

ఉచిత బస్సు. ఏపీలో కూటమి హామీలలో కీలకమైన వాటిలో ఇదొకటి. ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతున్నా, ఇప్పటివరకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పధకం ఇంకా అమల్లోకి రాలేదు . దీనిపై మహిళా లోకంలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, త్వరలోనే ఆ పధకాన్ని అమల్లోకి తీసుకొస్తామని సర్కార్ అంటోంది. అయితే, తాజా బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి ఊసే లేకపోవడంతో... విపక్ష నేతలు విమర్శలతో చెలరేగిపోతున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. జనసేన తెలుగుదేశం బిజెపి లను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కు భారీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా... మరికొన్ని ఇంకా మొదలు కాలేదు. అయితే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, కొన్ని పథకాల ఊసు అందులో కనిపించలేదు . దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా మహిళాలోకం  ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఉచిత బస్సు పథకం హామీ అమల్లోకి రాలేదు . బడ్జెట్లో కూడా దాని గురించి ఊసే ఎత్తకపోవడంతో, అసలు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని చెబుతోంది. 

గడచిన తొమ్మిది నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వివిధ శాఖల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. అదే విధంగా మిగతా మంత్రులు కూడా వారివారి శాఖల్లో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకున్న కూటమి సర్కార్ .... ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు... కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది . అంతేకాదు, కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తోంది . అయితే సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి... నెలకు 4000 రూపాయల పింఛన్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా... వృద్ధుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అయితే ఉచిత బస్సు పథకం కోసం మహిళలు మాత్రం తొమ్మిది నెలల నుంచి ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. మరి ఆ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు గానీ విపక్షం నుంచి మాత్రం అనేక విమర్శలు వసున్నాయి. 

కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పధకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు . కానీ, ఏపీలో మాత్రం ఇంకా... మొదలు పెట్టలేదు . తాజా బడ్జెట్ లో కూడా... మహిళలకు ఉచిత బస్సు పధకం ఊసెత్తకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.  ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం పథకం అమలు చేస్తామని ఆశ చూపి.. తీరా బడ్జెట్‌లో దాని గురించి మాట్లాడలేదు అని వైసీపీ విమర్శలు చేస్తోంది .  అయితే, కర్ణాటక , తెలంగాణాలలో ఉచిత బస్సు పధకం వలన... ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అక్కడి విపక్షాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. 

అయితే,  ఏపీలో ఉచిత బస్సు కంటే.. అర్జెంటుగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చెయ్యడం ముఖ్యం అని కూటమి ప్రభుత్వం భావిస్తోందట . ఎందుకంటే, ఈ రెండు పథకాల ప్రభావం విద్యార్థుల తల్లిదండ్రులపై,  రైతన్నలపై ఉంటుంది. వీటిని త్వరగా ప్రారంభించకపోతే, వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఉచిత బస్సు అర్జెంటుగా ప్రారంభించకపోయినా.. అంత ఇబ్బందేమీ ఉండదు కాబట్టే.. వీటికి నిధులు కేటాయించి, వీటిని ముందు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించినట్లు తెలుస్తోంది.  మరి.. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో కాలమే తేల్చాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu