గోరంట్ల మాధవ్ కు ఇచ్చి పడేసిన వంగలపూడి అనిత.. పోసానినీ వదల్లేదు!

ఒక వేలుతో ఎదుటి వారిని తప్పు పడితే మూడు వేళ్లు తమ తప్పులను ఎత్తి చూపుతాయని వైసీపీ నేతలు ఎప్పటికి తెలుసుకుంటారో కానీ, అధికారం కోల్పోయిన తరువాత కూడా వారి ధోరణి మారడం లేదు. అధికార కూటమిలో చీలికలు అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ, వైసీపీ అధికార ప్రతినిథి గోరంట్ల మాధవ్ తెలుగుదేశం కూటమిలో అంతర్యుద్ధం వస్తుందంటూ జోస్యం చెప్పారు. గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి ఓ రేంజ్ లో రిటార్డ్ ఇచ్చారు. శనివారం (మార్చి 1) మీడియాతో మాట్లాడిన ఆమె కూటమి ఐక్యంగా ఉంది, ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పడమే కాకుండా.. ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోండంటూ హితవు పలికారు. 

ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ సర్కార్ కాదు.. తెలుగుదేశం కూటమి సర్కార్.. గతంలోలా ఇష్టారీతిగా, నోటికి వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదన్నారు.  ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు మాట్లాడటంపైనా వంగలపూడి అనిత మండి పడ్డారు. నిజంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ప్రకారం ముందుకు వెడితే రోడ్డు మీద వైసీపీ నేత అనేవాడెవరూ తిరగలేరన్నారు. 

పోసాని అరెస్టు విషయంలో స్పందిస్తూ ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేయడం లేదనీ, అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తి కూడా లేదనీ వంగలపూడి అనిత విస్ఫష్టంగా చెప్పారు. ఎవరైనా, ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పించుకోలేరని హెచ్చరించారు. పోసాని కృష్ణ మురళికి స్క్రిప్ట్ సజ్జల రాసి ఇచ్చానా ‘రాజా’ శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. 

 ఇలా ఉండగా కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేనలు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టి ఆమె గోప్యతకు భంగం కలిగించిన కేసులో విచారణకు రావాలంటూ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా గోరంట్ల చేసిన వ్యాఖ్యలు ఆయనను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లుగా కనిపిస్తోంది.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu