టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిన మీనాక్షి.. సింప్లిసిటీ పాఠాలు నేర్పిస్తున్న నటరాజన్
posted on Mar 1, 2025 5:04PM

మీనాక్షి నటరాజన్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ! గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మీనాక్షిని.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఏఐసీసీ బాధ్యతలు అప్పజెప్పినప్పుడే.. అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు.. ఆవిడ సింప్లిసిటీ చూశాక.. పార్టీ పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ గురించి తెలిశాక.. ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. తెలంగాణలో మనం అధికారంలో ఉన్నాం. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పనిచేసినట్లన్న ఆమె డైలాగ్.. ఇప్పుడు గాంధీ భవన్‌లో రీసౌండ్‌లో వినిపిస్తోంది.
సాధారణంగా.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇన్ చార్జ్ వస్తున్నారంటే.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో హడావుడి మామూలుగా ఉండదు. పార్టీ నేతల హంగామాకు హద్దే ఉండదు. కానీ.. మీనాక్షి నటరాజన్ ఫ్లైట్‌లో కాకుండా.. సాదాసీదాగా ట్రైన్‌లో రావడం చూసి అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. పార్టీలో ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆవిడ.. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా.. సింపుల్‌గా భూజానికి ఓ హ్యాండ్ బ్యాగు, వీపున చిన్న లగేజీ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చేశారు. స్వాగతాలు, పూల బొకేలు, ఫ్లెక్సీలు, శాలువాలు, సన్మానాల లాంటివి తనకు నచ్చవని.. వాటికి దూరంగా ఉండాలని ముందే పార్టీ నేతలకు సూచించారు. తన బ్యాగ్ కూడా తానే మోసుకొని వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా.. తాను ఆన్‌లైన్‌లో సొంతంగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న దిల్ కుశా గెస్ట్ హౌజ్ గదిలో దిగారు. అక్కడే బస చేశారు. ఇది.. ఆవిడ సింప్లిసిటీకి మరో ఎగ్జాంపుల్.
మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. ఎమర్జెన్సీ మీటింగులకు, రాహుల్ గాం ధీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు.. అత్యవసర పిలుపు వస్తే మినహా.. ఆమె ఫ్లైట్ జర్నీ చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయ్. ఆమె వెంట ఎప్పుడూ రెండు జతల బట్టలే ఉంటాయ్. మామూలు భోజనమే చేస్తారు. నాన్‌వెజ్‌కు దూరం. ఎక్కడికెళ్లినా.. ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. కాన్వాయ్ ప్రయాణానికి సైతం దూరంగా ఉంటారు. సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తారు. గ్రూప్ మీటింగులు తప్ప.. పర్సనల్ మీటింగులకు ఆవిడ దూరం. అంతేకాదు.. టైమ్ అంటే టైమే. సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్టుల కోసం ఎదురుచూడరు. ఎవరొచ్చినా.. రాకపోయినా.. ఆ సమయానికి మీటింగ్ మొదలు పెట్టేస్తారు. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా.. ప్రతి శనివారం మౌన వ్రతం పాటిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెబుతారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన మీనాక్షి నటరాజన్.. గతంలో ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2 009లో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ఎంపీగా ఎన్నికయ్యారు. మీనాక్షి.. అసలు సిసలైన గాంధేయవాది. అందుకే.. గాంధీ ఫ్యామిలీకి ఆమె సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు, తెలంగాణ ఇన్ చార్జిగా వచ్చీ రావడంతోనే.. తన మార్క్ చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు.. ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పనిచేయాలని సూచించారు. పైరవీల ఆలోచన.. మైండ్‌లో నుంచి తీసేయాలని హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్‌లో పని చేసే వారికే.. పదవులు వస్తాయని క్లియర్‌గా చెప్పేశారు.
మనిషి సాఫ్ట్‌గా కనిపించినా.. పార్టీ విషయంలో చాలా సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్‌లోనే.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని.. సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు. మీటింగ్ తర్వాత కూడా మీనాక్షి నటరాజన్.. నేరుగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఢిల్లీ బయల్దేరిపోయారు. తన కోసం ఎవరూ స్టేషన్‌కు రావొద్దని.. తన బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని పీసీసీ సమావేశంలో ఆమె సూచించారు. మీనాక్షి నటరాజన్ నిరాడంబరత చూశాక.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆవిడని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.