కోడికత్తి శీనుకు నో బెయిల్
posted on Sep 23, 2023 9:27AM
కోడికత్తి శీనుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐదేళ్లు పూర్తియినా ఆయనకు బెయిలు రాలేదు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడిచేశాడన్న అభియోగంపై కోడి కత్తి శీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నాడు. మామూలుగా అయితే ఏ కేసులోనైనా సరే ఆరు నెలల తరువాత మామూలుగానే బెయిలు వచ్చేస్తుంది.
అయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న ఒకే ఒక్క కారణం చేత అప్పట్లో జగన్ ఈ కేసు విచారణ ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) చేపట్టాలని పట్టుబట్టి సాధించుకున్నారు. సాధారణంగా ఎన్ఐఏ ఉగ్రవాద కేసులను మాత్రమే చేపడుతుంది. ఈ కేసులలో బెయిలు రావడం అంత తేలిక కాదు. దాంతో కోడికత్తి కేసు ఎన్ఐఏ చేపట్టడం.. విచారణ ముగింపు దశకు వచ్చినా బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ అందుకు విముఖంగా ఉండటంతో కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. గతంలో ఒక సాయి బెయిలు మంజూరైనా ఎన్ఐఏ గట్టిగా అభ్యంతరం చెప్పడంతో రద్దైంది. ఇప్పుడు కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చేసింది. జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే ఇక కేసే ఉండని పరిస్థితి.
ఈ స్థితిలో జగన్ ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు సరిగా చేయలేదనీ, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేసే వ్యూహాలను జగన్ అవలంబిస్తున్నారని కోడికత్తి శీను తరఫు లాయర్ అంటున్నారు. ఈ దశలో విజయవాడ నుంచి ఈ కేసు దర్యాప్తును విశాఖకు మార్చారు.
తాజాగా కోడికత్తి శీను బెయిలు పిటిషన్ విచారించిన విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో బెయిలు ఇచ్చే అధికారం తమకు లేదనీ, బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లాలనీ సూచించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడికత్తి శీను తల్లి రెండు మార్లు లేఖలు రాసిన సంగతి విదితమే. అయితే ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఇదేళ్ల పాటు జైల్లో మగ్గిన కోడికత్తి కేసు నిందితుడు శీను ఇప్పుడు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించడం వినా మరో మార్గం లేదు. అక్కడ కూడా జగన్ ఎన్ఐఏ కోర్టులో బాధితుడిగా వాంగ్మూలం ఇస్తే తప్ప బెయిలు మంజూరయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.