అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై హత్య ప్రయత్నం
posted on Nov 19, 2014 8:31AM
.png)
అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై ఈరోజు ఉదయం హత్యా ప్రయత్నం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయన రోజూలాగే ఈరోజు ఉదయం కూడా తన సోదరుడు ప్రసాదరెడ్డితో కలిసి మార్నింగ్ వాక్ చేసేందుకు హైదరాబాద్ లో గల కే.బి.ఆర్ పార్క్ కు వచ్చేరు. వారిరువురు తమ వాకింగ్ ముగించుకొని పార్క్ బయట పార్కింగ్ చేసిన తమ ఆడి కారులో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడే పొంచి ఉన్న ఆ గుర్తుపట్టని వ్యక్తి, నిత్యానంద రెడ్డితో బాటు కారులోకి దూరి ఆయనపై తన వద్ద గల ఏ.కె. 47 రైఫిల్ తో కాల్పులు జరపబోయారు. కానీ నిత్యానంద రెడ్డి కూడా అతని చేతిలో రైఫిల్ పక్కకు త్రిప్పివేసి గట్టిగా ప్రతిఘటించడంతో ప్రాణాలతో తప్పించుకోగలిగారు. కానీ ఆ సమయంలో రైఫిల్ నుండి ఫైర్ అయిన బుల్లెట్లు కారు ముందు వైపున్న అద్దాల గుండా చొచ్చుకుపోవడంతో కారు అద్దం పగిలిపోయింది.
అదే సమయంలో అక్కడికి పరుగున వచ్చిన ప్రసాద రెడ్డి ఆ దుండగుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకొనే ప్రయత్నం చేసారు. కానీ అతను వారిరువురి నుండి తప్పించుకొని పారిపోయాడు. కానీ అతని చేతిలో ఉన్న ఏ.కె.47 రైఫిల్ మాత్రం కార్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని హత్యా ప్రయత్నం జరిగిన ఆ ప్రాంతాన్ని, కారును కూడా తమ అధీనంలో తీసుకొని, ప్రత్యక్ష సాక్షుల నుండి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.