వచ్చేసిందోచ్.. కరోనా అన్ని వేరియంట్లను ఎదుర్కొనే టీకా!
posted on Feb 7, 2022 3:23PM
ఆల్ఫా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్.. వేరియంట్ ఏదైనా.. కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్‌ను రూపొందించారు ఇండియన్ సైంటిస్టులు. ఇప్పటికే పుట్టుకొచ్చిన వేరియంట్లతో పాటు భవిష్యత్తులో రాబోవు రకాలను తమ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఆ వ్యాక్సిన్‌కు ‘‘అభిస్కొవాక్’’ అని పేరు పెట్టారు.
‘‘అభిస్కొవాక్’’ టీకా అన్ని వేరియంట్లను నిలువరిస్తుందని అంటున్నారు పశ్చిమబెంగాల్‌లోని కాజీ నజ్రుల్ వర్సిటీ, ఒడిసా భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) శాస్త్రవేత్తలు. ఇమ్యునో ఇన్ఫర్మేటిక్ పద్ధతులను ఉపయోగించి ఈ వ్యాక్సిన్‌ను డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఇది పెప్టైడ్ (ఎమైనో ఆమ్లాలున్న అణువు) వ్యాక్సిన్.
చిమెరిక్ పెప్టైడ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే అభిస్కొవాక్.. కొవిడ్ కుటుంబంలోని ఆరు వేరియంట్ల (హెచ్‌కొవ్-229ఈ, హెచ్‌కొవ్-హెచ్‌కేయూ1, హెచ్‌కొవ్- ఓసీ43, సార్స్-కొవ్, మెర్స్-కొవ్, సార్స్-కొవ్2)కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు. కంప్యూటేషనల్ పద్ధతులను ఉపయోగించి.. ఈ టీకాను అభివృద్ధి చేశామని, పరీక్షల అనంతరం ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
తాజా, పరిశోధన వివరాలను ప్రచురించేందుకు మాలిక్యులర్ లిక్విడ్స్ జర్నల్స్ అంగీకరించింది. సాధారణ పరమాణు, సంక్లిష్ట ద్రవ నిర్మాణం-పరస్పర చర్యలు, గతిశీల ప్రక్రియలు, ప్రాథమిక అంశాలకు సంబంధించిన పరిశీలనలను ఈ జర్నల్ ప్రచురిస్తుంటుంది. అయితే, ఈ వ్యాక్సిన్‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది.