సజ్జల బెదిరింపులు.. జగన్‌రెడ్డి అల్పబుద్ధి.. చంద్రాగ్రహం..
posted on Feb 7, 2022 4:01PM
ఏపీ ఉద్యోగులను సజ్జల బెదిరించడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకి జగన్‌రెడ్డి సర్కార్ రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో వైసీపీ కోత విధించడమే.. సీఎం జగన్‌రెడ్డి పెద్ద మనస్సుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో.. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. లూటీ, దుబారా కట్టిపెట్టి ఉద్యోగుల , పించన్‌దారుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇచ్చిన రాయితీల్లో కోతలు కోయరాదన్నారు చంద్రబాబు.
కరెంటు కోతలు వెంటనే నివారించాలని.. విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని.. డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేయాలని.. టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. 32 నెలల పాలనలో 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు.. ప్రజలపై రూ.11,611 కోట్ల భారం మోపారని మండిపడ్డారు.
పాఠశాలల విలీనం వల్ల చిన్న పిల్లలు దూరభారాలు పెరిగి నష్టపోతున్నారని.. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని.. పాఠశాలల విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలని చంద్రబాబు అన్నారు.
భారతి సిమెంటు ప్రయోజనాల కోసం భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీయవద్దని.. వేల కోట్ల ముడుపుల కోసం ఉచిత ఇసుక విధానం రద్దుచేసి 4 రెట్లు ఇసుక ధర పెంచారని.. సిమెంటు బస్తాపై ఈ మూడేళ్లలో రూ.150లు పెంచారని.. పెంచిన సిమెంటు, ఇసుక ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్దిదారులకు స్వాధీనం చేయాలని.. టిడ్కో గృహాల పేరుతో తెచ్చిన రూ.7,300 కోట్లు దారిమళ్లించారని.. ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో మరో రూ.4వేల కోట్ల అప్పుకు సిద్ధం అవుతున్నారని మండిపడ్డారు.
హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్నప్పుడు రాజధాని భూములు తనఖా పెట్టడం చట్ట విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌తో 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.