ఫిరాయింపులపై ఎవరి భాష్యం వారిదే!

ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్ర‌మైన వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయ్. ఓట్ల చోరీ  కంటే ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద నేరమంటారు  కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్.. అస‌లు ఫిరాయింపు ఎక్క‌డుంది?  ఒక సీఎం అన్నాక‌.. ఎంద‌రో ఎమ్మెల్యేలు  వ‌స్తుంటారు పోతుంటారు. ఆ టైంలో వారికి కండువాలు క‌ప్పుతుంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాష్యం చెబుతారు. అబ్బే తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారాయన. 

ఇదే విష‌యంలో..   క‌డియం శ్రీహ‌రి మరో చిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తాను ఏ పార్టీ అన్నది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదంటున్నారు కడియం శ్రీహరి.  ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీక‌ర్ తేల్చ‌డ‌మేంటి?  అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంతు అవుతోంది. ఆయ‌న  ఏ పార్టీ ద్వారా బీఫాం తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాట్లలోని వితండం ఎక్కడిది అంటే.. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి అదేంటంటే.. ఇదే స్టేష‌న్ ఘ‌న్ పూర్ సీటు త‌న‌కు ద‌క్కాల్సింది పోయి.. శ్రీహ‌రి త‌న్నుకుపోయార‌ని అంటారు రాజ‌య్య‌. టికెట్ ఇవ్వ‌కుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తాన‌ని బెదిరించి మ‌రీ క‌డియం ఈ టికెట్ బ‌ల‌వంతానా తీసుకున్నారని చెబుతున్నారాయన.  

ఇక పోతే ఇదే క‌డియం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే అన్న మాట‌.. ఏంటంటే, ఏదైనా జ‌ర‌గొచ్చు. కాంగ్రెస్ అధికారం వెంట‌నే కోల్పోవ‌చ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంద‌రు మా ట‌చ్ లో ఉన్నార‌ంటూ ఫీలర్లు వదిలారు.  ఆ వెంట‌నే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదే మంటే నియోజ‌క‌ర్గం కోస‌మే ఇదంతా చేస్తున్నానంటారు. కావాలంటే చూడండీ ఇప్ప‌టి వ‌ర‌కూ వెయ్యి కోట్ల‌కు పైగా నిధులు ప‌ట్టుకొచ్చానని చెప్పుకుంటున్నారు.  ఇటు చూస్తే సీఎం అస‌లు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అస‌లు ఓట్ల చోరీక‌న్నా  ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద‌ద‌ని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటు కాని సందిగ్దావ‌స్త ఈ ఎమ్మెల్యేల‌ది. మొన్న‌టికి మొన్న బీఆర్ఎస్ గ‌ద్వాల్ స‌భ జ‌రిగితే ఎమ్మెల్యే బండ్ల త‌న ఫ్లెక్సీల‌కు ప‌ర‌దాలు క‌ప్పుకున్న దృశ్యం క‌నిపించింది. దీంతో తెలంగాణ‌లో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాష్యం చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu