రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా... 474 పార్టీల గుర్తింపు రద్దు
posted on Sep 19, 2025 9:32PM

చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చురుకైన రాజకీయ కార్యకలాపాలు లేని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టీవ్‌గా లేని 808 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. 2019 తర్వాత జరిగిన ఏకైనా ఎన్నికల్లో పాల్గొనని పార్టీలను ఈసీ గుర్తించి చర్యలు తీసుకుంది. పేరుకు మాత్రమే నమోదు చేసుకున్నా, వీటికి స్థిరమైన కార్యాలయాలు కూడా లేవని కమిషన్ వెల్లడించింది.
ఇంతకుముందు 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ, మరో విడతలో 474 పార్టీలను కూడా వేటు వేసింది. రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల నమోదును రద్దు చేసింది. ఇప్పటి వరకు దేశంలో 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,046కు తగ్గింది. ప్రస్తుతం భారత్‌లో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రమే చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఈసీ స్పష్టం చేసింది.