నెల్లూరు కాంగ్రెస్ టిక్కెట్ కోసం సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు
posted on Mar 13, 2012 3:45PM
.jpg)
నెల్లూరు లోక్ సభ స్థానానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ డానికి అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తుడైన టి. సుబ్బిరామిరెడ్డి తాజాగా నెల్లూరులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు టిటిపి చైర్మన్ గా, ఒకసారి కేంద్రమంత్రిగా పదవిని అలంకరించిన సుబ్బిరామిరెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల్లో విశాఖనుంచి పోటీచేయాలన్న అభిమతాన్ని వ్యక్తం చేశారు. ఈలోగా నెల్లూరులో అవకాశం రావడంతో అక్కడినుంచే పోటీచేసి లోక్ సభకు వెళ్ళాలని ఆయన ఉబలాటపడుతున్నట్లు తెలిసింది.
అయితే నెల్లూరు జిల్లాలో పాగా చేయాలంటే ముందుగా ఆనం సోదరులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకే ఆయన ఆనం వివేకానంద రెడ్డితో ఫోన్ లో మాట్లాడేందుకు ఇటీవల పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిసింది. సుబ్బిరామిరెడ్డి అభిప్రాయాన్ని ముందుగానే గమనించిన ఆనం వివేకానందరెడ్డి ఉద్దేశ్య పూర్వకంగానే ఆయనతో మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. అధిష్టానం అనుగ్రహిస్తే నెల్లూరు నుంచి తానే పోటీచేయాలని ఆనం వివేకానందరెడ్డి యోచిస్తున్నారు. తాను ఒకవైపు నెల్లూరు నుంచి పోటీచేయాలనుకుంటుండగా మరో వైపు సుబ్బిరామిరెడ్డి తనకు పోటీగా వస్తే సహించేది లేదని ఆనం తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది.