వైయస్సార్ పిసి అభ్యర్థి గొల్ల బాబూరావుకు మంత్రి బాలరాజు ఆశీస్సులు?

విశాఖజిల్లా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ముప్పుతెచ్చేవిగా మారాయి. ఈ జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజుకు, గంటా శ్రీనివాసరావుకు మధ్య ప్రచ్చన్నయుద్ధం ప్రారంభమైంది. ఇది మరింత ముదిరి పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం వుంది. ఈ జిల్లాలో ఉన్న పాయకారావుపేట నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బాధ్యతంతా మంత్రి బాలరాజుకు అప్పగిస్తారని మొదట భావించారు. అయితే ఆయనకు బదులుగా ఇటీవల పిఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావుకు అప్పగించడంతో వివాదం తలెత్తింది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.

 

పాయకారావుపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గొల్ల బాబూరావు మంత్రి బాలరాజుకు ఒక్కప్పుడు ప్రియశిష్యుడు. అందువల్ల బాలరాజుకు కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఆయన మనస్పూర్తిగా పనిచేయకపోవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలిసింది. అందుకే గంటాకు ఈ బాధ్యతను అప్పగించినట్లు భావిస్తున్నారు. తనపై అనుమానంతో తనకు బాధ్యతలను అప్పగించనందుకు బాలరాజు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా ఆయన పరోక్షంగానైనా తన శిష్యుడు గొల్ల బాబూరావు విజయాన్ని కాంక్షించే అవకాశం ఉందని ఈ పరిణామాల నేపధ్యంలో కార్యకర్తలు అనుమానిస్తున్నారు.

 

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu