ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇన్ని రోజులుగా మోడీ, షా ల ఛాయిస్ ఎవరు అన్న విషయంలో నెలకొన్న ఆసక్తి, సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు.

ఆదివారం (ఆగస్టు 17) జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం రాధాకృష్ణన్ ను ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న   రాధాకృష్ణన్  గతంలో జార్ఖండ్, పాండిచ్చేరి గవర్నర్ గా కూడా పని చేశారు.

కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కోయంబత్తూర్ నుంచి రెండు సార్లు లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వెంకయ్యనాయుడు తరువాత దక్షిణాదికి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున ఎంపికైన రెండో వ్యక్తి రాధాకృష్ణన్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu