నల్లకుబేరుల పేర్లు బయటపెడితే సరిపోతుందా?

 

భారత్ కు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పెద్ద ఎత్తున విదేశీ బ్యాంకులలో దాచిపెట్టిన నల్లదనం వెలికి తీస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టగానే సీబీఐ, రా, న్యాయ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం)ను ఏర్పాటు చేసి నల్లదనం వెలికితీతకు చర్యలను వేగవంతం చేసారు. కానీ విదేశాలతో ఉన్న డీ.టీ.ఏ.ఏ.(డబుల్ టాక్సేషన్ అవాయిడేన్స్ అగ్రిమెంట్) ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా నల్లదనం దాచిన వ్యక్తుల పేర్లను బయటపెట్టడం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడంతో, ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వారికి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తూ మాజీ కేంద్రమంత్రి ఒకరు ఈ నల్లకుబేరులలో ఒకరని, వారి పేర్లను బయటపెడితే మొట్టమొదట కాంగ్రెస్ పార్టీయే సిగ్గుతో తలవంచుకోవలసి ఉంటుందని ఘాటుగా జవాబిచ్చారు. దానికీ కాంగ్రెస్ నేతలు చాలా ధీటుగా స్పందించడంతో, కేంద్రప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లు బయటపెట్టవచ్చని తాజా సమాచారం.

 

భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం నల్లదనం దాచిన వ్యక్తులపై విచారణ చేప్పట్టకుండా ఎవరి పేర్లను బహిర్గతం చేయరాదు. అలా చేసినట్లయితే ఒప్పందం ఉల్లంఘన చేసినట్లే అవుతుంది కనుక, ఇకపై విదేశాలలో మరే ఇతర బ్యాంకులు కూడా నల్లదనం దాచిన భారతీయుల వివరాలు కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరించవచ్చును. అదే జరిగితే ‘నల్ల కుబేరులు’ అందరూ చట్టం నుండి తప్పించుకోవడానికి గొప్ప అవకాశం ఏర్పడుతుంది. కనుకనే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టులో ముగ్గురు నేతల పేర్లను వెల్లడించినట్లయితే ఒప్పందం ఉల్లంఘన చేసినట్లే అవుతుంది కనుక ఇప్పటికే కొంతమందిపై విచారణ ప్రారంభించిన వారిలో ముగ్గురు పేర్లను బహిర్గతం చేయవచ్చని తెలుస్తోంది. నల్ల కుబేరుల పేర్లు ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ తలదించుకోవలసి వస్తుందని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నందున బహుశః మొట్ట మొదటగా కాంగ్రెస్ నేతల పేర్లే బయటపెట్టవచ్చును.

 

కానీ ఈ విచారణ ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల విదేశాలలో వారు పోగేసిన నల్లదనం ఎప్పుడు తిరిగి దేశానికి వస్తుందో కూడా ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేరు. కనుక ఇప్పుడు నల్ల కుబేరుల పేర్లను బహిర్గతం చేసినంత మాత్రాన్న దేశానికి కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును. కానీ ఎన్డీయే ప్రభుత్వం తన ప్రత్యర్ధ పార్టీతో రాజకీయ చదరంగం ఆడుకోవడానికి మాత్రం ఉపయోగపడవచ్చును. ఒకవేళ ఈ వ్యవహారం ఎలాగు ఇప్పుడప్పుడే తేలేది కాదని గ్రహిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా స్పందిస్తూ ఈ రకంగా బీజేపీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రచారం చేసుకోవచ్చును.

 

త్వరలో ఝార్ఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, ఆ ఎన్నికలలో ఇదే ప్రధానాంశంగా చేసుకొని బీజేపీ యుద్ధం చేసినా ఆశ్చర్యం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu