నల్లధనం ఆరోపణలను ఖండించిన డాబర్ సంస్థ

 

విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారిలో డాబర్ కంపెనీకి చెందిన ప్రదీప్ బర్మన్ కూడా ఒకరని నిన్న కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడాన్ని ఆ సంస్థ తప్పు పట్టింది. విదేశీ బ్యాంకులలో ఖాతాలున్నవారినందరినీ ఒకే గాట కట్టడం సబబు కాదని పేర్కొంది. అనేక దశాబ్దాలుగా భారతదేశంలో వ్యాపారం చేస్తున్న తమ సంస్థకు మంచి పేరు ప్రతిష్టలున్నాయని, తమ వ్యాపారలావాదేవీలన్నిటికీ సరయిన రికార్డులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నామని అయినప్పటికీ తమ సంస్థను దోషిగా చూపడం సమంజసం కాదని పేర్కొంది. ప్రవాస భారతీయుడయిన తమ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, అనేకమంది ఇతర ప్రవాస భారతీయుల మాదిరిగానే చట్టబద్దంగా విదేశాలలో బ్యాంక్ అకౌంట్ కలిగిఉన్నారని దానిని చూపి తమ సంస్థ విదేశాలలో నల్లదనం దాచి ఉంచిందని పేర్కొనడం చాలా తప్పని డాబర్ సంస్థ వాదించింది. తమ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ విదేశాలలో కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాల గురించి ఎన్నడూ దాచిపుచ్చే ప్రయత్నం చేయలేదని, అన్ని పన్నులు సక్రమంగా కడుతున్నారని అటువంటి వ్యక్తిపై ఇటువంటి ఘోరమయిన నిందవేయడం తగదని ఆ సంస్థ పేర్కొంది. ఒకవేళ డాబర్ సంస్థ ఇది తన పరువుప్రతిష్టలకి సంబందించిన వ్యవహారంగా భావించినట్లయితే కోర్టుకి వెళ్ళినా వెళ్ళవచ్చును.