ఎన్సీపీలో ... ఎన్సీపీ విలీనం?

ఓ వంక దాయాది దేశాలు భారత్ , పాకిస్థాన్ మధ్య యుద్ధం నడుస్తోంది. మరో వంక  మహారాష్ట్రలో విడిపోయిన దాయాది పార్టీలు మళ్ళీ ఏకమయ్యేందుకు రాయబారాలు, దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అవును ఏప్రిల్  22 న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన నేపధ్యంలో..  ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే లక్ష్యంతో  భారత ప్రభుత్వం, భారత సైన్యం ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్  భారత – పాకిస్థాన్ దేశాల మధ్య మరో యుద్ధానికి తెర తీసింది. 

ఆదే సమయంలో మహా రాష్ట్రలో రెండేళ్ళ క్రితం రెండుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మళ్ళీ ఒకటయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి,  2024  నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ గురించిన చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా  అధికార కూటమిలోని బీజేపీ,శివసేన,ఎన్సీపీల మధ్య సయోధ్య కొంత దెబ్బ తిన్న నేపధ్యంలో శివసేన, ఎన్సీపీలలో అంతర్మథనం మొదలైంది. అలాగే ఉప మఖ్యమంత్రి అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ  శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ(ఎస్పీ) పునః ఏకీకరణ గురించిన చర్చ తరచూ తెరపైకి వస్తూనే వుంది. అయితే.. కారణాలు ఏమైనా,ఇంతవరకు ముడిపడలేదు.   

అయితే ఇప్పడు స్వయంగా శరద్ పవార్  రెండు ఎన్సీపీలు ఒకటయ్యే అంశాన్ని మరో మారు తెర పైకి తెచ్చారు. అయితే.. ఆ నిర్ణయం ఏదో తన తదుపరి తరం మరీ ముఖ్యంగా తన రాజకీయ వారసురాలు, బారామతి ఎంపి సుప్రియా సులే తీసుకుంటారని శరద్ పవార్ పరోక్షంగానే  తనకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారని  అంటున్నారు. మరో వంక అజిత్ పవార్  సారథ్యంలోని ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే  శరద పవార్ అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ఆయన నుంచి అటువంటి ప్రతిపాదన వస్తే పార్టీ కోర్  గ్రూప్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని, సానుకూల సంకేతాలు ఇచ్చారు. 

అయితే.. ఇరు పార్టీలకు ఇష్టమే అయినా, రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల కలయిక కష్టమే అంటున్నారు. ముఖ్యంగా  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీ సారథ్యంలోని మహాయుతి నుంచి బయటకు వచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. నిజానికి  తత్కరే కూడా  మేము మహాయుతిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం.  మా నిర్ణయం మారదు. మహాయుతి నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు  అని స్పష్టం చేశారు. నిజానికి  ఉభయ పార్టీల విలీనం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. శరద్ పవర్ బీజేపీతో చేతులు కలిపేందుకు అంగీకరించక పోవడం వల్లనే  విలీనం జరగ లేదని, ఇప్పడు కూడా ఉభయ పార్టీల విలీనానికి బీజేపీనే అడ్డుగా నిలిచిందని అంటున్నారు. 

అయితే..  అధికార కూటమిలో చేరాలని పార్టీలో ముఖ్యంగా యువ నాయకుల నుంచి వత్తిడి పెరుగతునందునే పవార్  నిర్ణయాధికారాన్ని కుమార్తె  రాజకీయ వారసురాలు సుప్రియ సులే చేతిలో పెట్టారని అంటున్నారు. అందుకే ఆయన  గురువారం(మే 8) మీడియా సమవేశంలో మాట్లడుతూ.. రెండు ఎన్సీపీ వర్గాల మధ్య సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు. అయితే  పార్టీలో  ఒక వర్గం నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు,ఇతర ముఖ్య నాయకులు తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు అమలు కావాలంటే  అజిత్ పవార్ పార్టీతో చేతులు కలపాలని అంటున్నారు. మరి కొందరు అందుకు అంగీకరించడం లేదు  అంటూ  పవార్ మనసులో మాటను మనసులోనే దాచుకున్నారు. అలాగే..  నిర్ణయం తీసుకునే అధికారం ప్రస్తుతం తనకు లేదనీ అన్నారు.  అందుకే నిర్ణయాన్ని నెక్స్ట్ జనరేషన్  కు వదిలేశారని శరద్ పవార్ అన్నారు. 

అజిత్ పవార్ 2023లో 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని రెండుగా చీల్చారు.  అయితే ఈ మధ్య కాలంలో  బాబాయి – అబ్బాయి (పవార్’లు ఇద్దరు) దగ్గరవుతున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గడచిన రెండు నెలల కాలంలో ఇద్దరు నేతలు మూడు నాలుగుసార్లు కలవడంతో ఉహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. 

అదలా ఉంటే..  శరద్ పార్టీ నాయకులలో చాలా మంది నాయకులు అజిత్  పవార్ తో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారని, ఎన్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సూరజ్ చవాన్   అంటున్నారు. పార్టీలు విలీనం అయినా  కాకున్నా  శరద్ పవార్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్సీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అలాగే.. మహాయుతిలో కొనసాగాలనే అజిత్ పవర్ నిర్ణయంతో ఏకీభవిస్తే సుప్రియా సులే  ఇతర నాయకులకు స్వాగతం పలికేందుకు ఎన్సీపీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రెండు పార్టీలు ఒకటయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనీ ఉభయ పార్టీల నాయకులూ అంటున్నారు. అయితే..  అదే జరిగితే బీజేపీ  పొడ గిట్టని సీనియర్ నాయకులు కొందరు వేరే దారులు వెతుక్కోవచ్చని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu