కాంగ్రెస్ తో కాశ్మీరీ పార్టీ కటీఫ్

 

కాంగ్రెస్ అధిష్టానం ఒకపక్క కొత్త పార్టీలను దువ్వుతూ వచ్చే ఎన్నికలలోగా ఎలాగయినా మచ్చిక చేసుకొని వాటితో పొత్తులు పెట్టుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తిప్పలు పడుతుంటే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం ఖాయమని పసిగట్టి కాంగ్రెస్ దోస్తులు కొందరు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఇప్పటి నుండే ఎన్డీయే కూటమిలోకి దూకేందుకు సిద్దం అవుతున్నారు.

 

యూపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నకాశ్మీరుకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మాజీ కాశ్మీరు ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ, "మా పార్టీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగాలా వద్దా అనే సంగతిని మా అబ్బాయి ఒమర్ అబ్దుల్లా నిర్ణయిస్తాడు. అతను ఏవిధంగా చెపితే పార్టీ ఆవిధంగా చేస్తుంది. అయితే ఇంకా అతను, మేము ఈవిషయంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు,” అని అన్నారు.

 

ఆయన మీడియా అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ, “ఒకవేళ దేశప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకొంటే వారి అభిప్రాయాన్ని మా పార్టీ గౌరవిస్తుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయం,” అని అన్నారు.

 

గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దానితో అంటకాగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అది ఎన్నికలలో ఓడిపోగానే దానిని వదిలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమిలోకి జంపయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేఖ గాలులు వీస్తూ, మోడీ భజన మారుమ్రోగిపోవడం చూసి ‘స్వంత గూటికి’ వచ్చేయాలని ఈ తండ్రీ కొడుకులు ఆరాటపడుతున్నట్లున్నారు. ఏ ఎండకి ఆ గొడుగు అంటే ఇదేనేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu