మానవుడే మహనీయుడు
posted on Jan 30, 2014 9:47AM

గుండెనిండా స్వేచ్చా వాయువులు పీల్చినపుడల్లా అందులో ఎందరో మహనీయుల త్యాగం అంతర్లీనంగా మనలని స్పృశిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మన జాతిపిత గాంధీ భారతీయుల ప్రతిశ్వాసలో ఈనాటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అలా౦టి మహానుభావుడి వర్ధంతి ఈ రోజు, స్మరించుకోవడం, మనసులో కృతజ్ఞతలు తెలియజేయడం, అయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించుకోవడం మనందరని కనీస ధర్మం . అహింస, శాంతి,సహనం, నిత్యం మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో అవసరపడే పదునైన ఆయుధాలు, వాటిని పరీక్షించి ఫలితాలని కూడా మనముందుంచారు. బాపూజీ నిస్సంకోసంగా వాటిని వాడొచ్చు మనందరం. మహానుభావుడు పూజ్యుడు,ఆరాధ్యుడు అంటూ గాంధీని మాటలతో పూజిస్తాం కాని నిజంగా ఆయనకి గుడి కట్టి నిత్యం ధూపదీపాలతో అర్చనలు చేస్తారంటే నమ్మగలరా, కాని నిజం మన దేశంలో రెండుచిట్ల అలా గాంధీజీ ఆలయాలు ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులోని కంకనాడిలో ఉందా గుడి. అక్కడ గాంధీయే దేవుడు. ఈ గుడి 1948 లోనే నిర్మించారు. నరసప్పసాలియాన్, సోమప్ప పండితే, వెంకటప్ప అనే వారికీ గాంధీ అంటే ప్రాణం గాడ్సే తుపాకీ గుళ్ళకి అయన నేలకొరిగారన్న వార్త విన్నాక అంతటి మహాత్ముడికి మరణం లేడు అని నమ్మి ఆయనకి గుడి కట్టారు ఈ ముగ్గురు. అప్పటినుంచి ఆ ఆలయంలో గాంధీజీ పూజలు అందుకుంటున్నారు. నేటికి నిత్యం అర్చనలు జరుపుతారు. జాతీయ పర్వదీనాల్లో ఆ ఆలయం జన సందోహంతో కిక్కిరిసిపోతుందట.
దూర దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం మహాత్ముడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబదతారట. ఇక గాంధీ జయంతి నాడు పల్లకీసేవ ప్రత్యేకంగా ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు అంతే కాదు ఆ ఆలయం చుట్టూ ప్రజల గట్టి నమ్మకం కూడా ఒకటుంది. గాంధీజీ ఆలయం గురించి దాని చుట్టూ ప్రజలఅల్లుకున్న విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మద్యపానం,ధూమపానం,జూదం వంటి వ్యసనాలకు బానిసయిన వారిని ఈ ఆలయానికి తీసుకు వచ్చి ప్రమాణం చేయిస్తే వారు ఆ వ్యసనాల జోలికి ఇక వెళ్ళారని ఆ చుట్టుపక్కల గ్రామస్తుల నమ్మకం. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఈ ఆలయానికి తీకుసువస్తే స్వస్థత చేకూరుతుందని కూడా నమ్ముతారు. మొక్కలు కడతారు చెల్లిస్తారు.గాంధీజీ జీవిత చరిత్ర వారికీ నిత్య పారాయణ గ్రంధం. ఇక గాంధీజీకి ఒరిస్సాలో కూడా ఓ గుడి వుంది.
గాంధీజీ తన జీవితంలో ఒకేఒకసారి ఒరిస్సాలో పర్యటించారు. అయితేనేం అక్కడ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసారు గాంధీజీ వారినేంతగా ప్రభావితం చేశారంటే ఆ రాష్ట్రంలో సంబాల్పూర్ కూ సమీపంలో బాత్రా అనే గ్రామంలో ఆయనకో గుడి కట్టించారు. అక్కడ జాతీయపర్వదీనాలు పెద్ద పండగలుగా, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ గ్రామం చుట్టు పక్కల ఇప్పటికీ ఖాదీ మాత్రమే ధరిస్తారు. ఆ ఆలయం గోడలానిండా స్వాతంత్రోద్యమ ఘట్టాలు చెక్కించారు. 'రఘుపతి రాఘవ రాజారాం' అన్నా గీతాన్ని వారు నిత్యం స్మరిస్తారు.
మహాత్ముడికి గుడి కట్టడమెందుకని అడిగితే వారెంమంటారో తెలుసా...ఈ గుడిలో మేము మహత్ముడిని కాదు..మానవత్వాన్ని పూజిస్తున్నాం. గాంధీజీ జీవిత చరిత్ర మాకు నిత్య పారాయణ గ్రంథం..దాని నుంచి ఎంతో స్పూర్తి పొందుతాం. అందుకే ఆయన మాకు దేవుడు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా..''ఈ ఆలయాన్ని చూడగానే రక్తమాంసాలున్న ఇటువంటి మనిషి ఈ భూమ్మిద నడిచాడంటే ముందుతరాల వారు నమ్మరు..అన్న ఐన్ స్టీన్ మాటలు గుర్తుకు రావాలి అందరికి...అన్న వారి మాటలు మానవుడే మహనీయుడు అని నీరుపిస్తున్నాయి. ఆ మహనీయుడి స్పూర్తితో ముందడుగు వేద్దాం.
.....రమ