నర్రా రాఘవరెడ్డి కన్నుమూత
posted on Apr 9, 2015 8:32PM

సీపీఎం సీనియర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి (88) కన్నుమూశాడు. నెలరోజుల క్రితం ఆయన తన ఇంట్లో జారిపడ్డారు. కాలు విరిగిన ఆయన కొంతకాలం నిమ్స్‌లో చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామమైన నల్గొండ జిల్లా వట్టిమర్తిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. నర్రా రాఘవరెడ్డి స్వగ్రామం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి. నకిరేకల్ నుంచి 1967లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఏడేళ్ళపాటు వట్టిమర్తి సర్పంచ్‌గా పనిచేశారు. నకిరేకల్ సమితి అధ్యక్షుడిగా ఏడాదిపాటు పనిచేశారు. అత్యంత నిరాడంబరంగా జీవనాన్ని సాగించిన కమ్యూనిస్టు నేతగా ఆయన పేరొందారు. నర్రా రాఘవరెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.