ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు.. వ్యూహాత్మకమేనా?
posted on Jul 21, 2025 11:16AM

ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు వేశారా? ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు అంగీకరించడాన్ని వెనకడుగుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా మోడీ విపక్షల డిమాండ్ కు అంగీకరించడం ఇదే తొలి సారి అని అంటున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట ప్రధాని మోడీ ఇలా వెనకడుగు వేయడానికి సభలో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులు ఉండటమే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం (జులై 21) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆదివారం (జులై 20) నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ అర్థంతరంగా నిలిపివేయడం, పహల్గాం దాడికి ఒక రోజు ముందు ప్రధాని మోడీ విదేశీ పర్యటనను అర్థంతరంగా నిలుపుదల, ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకూ ఇవే డిమాండ్లను విపక్షాలు పలుమార్లు చేసినా పెదవి విప్పని మోడీ పార్లమెంటు వేదికగా వీటిపై చర్చించేందుకు అంగీకరించారు.
ఇందుకు ప్రధానంగా ఈ శీతాకాల సమావేశాలలో ఎలాగైన ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న 12 బిల్లుల కోసమే మోడీ ఒక అడుగు వెనక్కు వేసి విపక్షాల డిమాండ్ మేరకు ఆ మూడు అంశాలపైనా చర్చించేందుకు ఓకే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.