ఏపీ మద్యం కుంభకోణం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తేడా ఏంటి?
posted on Jul 21, 2025 12:06PM
ప్రైవేటు వారు మద్యం అమ్మితే ఆ సొమ్ము.. ప్రైవేటు వారికే పోతుంది. అదే ప్రభుత్వం వారు అమ్మితే ఆ సొమ్ము ప్రభుత్వానికే నేరుగా వస్తుంది కదా? ఇదీ జగన్ సర్కార్ నాడు ఫాలో అయిన అసలు సిసలు నికార్సయిన లిక్కర్ కాన్సెప్ట్ జగన్ సర్కార్ ఎంతకు బరి తెగించిందంటే.. ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు మోహరించేంతగా చెలరేగిపోయింది. అదేమంటే టీచర్స్ బ్రాండ్స్ అమ్మే కదా టీచర్లకు జీతాలివ్వాల్సింది అన్న వితండ వాదన చేసి మరీ జగన్ సర్కార్ ఏపీ లిక్కర్ స్కామ్ చేసింది.
ఇక ఢిల్లీలో ఇందుకు రివర్స్ లో జరిగింది. అక్కడి పాలకులు ఎలా ఫీలయ్యారంటే.. మద్యాన్ని ప్రభుత్వం అమ్మడమేంటి? అసహ్యంగా.. ప్రైవేటు వ్యక్తులు కదా? అమ్మాల్సిందంటూ ఒక మద్యం పాలసీ తెచ్చారు. దీంతో మొత్తం బొమ్మ తిరగబడింది. ఇక్కడ ప్రభుత్వానికి రావల్సిన సొమ్ము కాస్తా ప్రైవేట్ పార్టీలు పట్టుకుపోవడంతో మొదలైంది అసలైన లిక్కర్ స్టోరీ.
అదిలా ఉంచితే వైసీపీ మధ్దతుదారులు చేస్తున్న కామెంట్ ఎలాంటిదంటే.. ఢిల్లీలా తమ ప్రభుత్వం ఖజానాకి నష్టం వచ్చేలాంటి పనులేవీ చేయలేదనీ. ఆ మాటకొస్తే.. గత చంద్రబాబు పాలనకంటే తమ పాలనలోనే మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం భారీ ఎత్తున ఉంటుందని.. దీని ప్రకారం చూస్తే ఇక్కడ స్కామే లేదని అంటారు వారు.
అయితే ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాటలను అనుసరించి చెబితే.. అసలు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్. దీని విలువ ఏకంగా 3 వేల కోట్లకు పైబడి. ఇప్పటి వరకూ పట్టుబడ్డవి చిన్న చిన్న చేపలు. వచ్చే రోజుల్లో భారీ తిమింగలం పట్టుబడే అవకాశముందని ఇన్ డైరెక్టుగా జగన్ పేరు ప్రస్తావించకుండానే అదే అర్ధమొచ్చే మాటలన్నారు.
ఇక ఫైనల్ గా సిట్ అధికారులు రూపొందించిన రిమాండ్ రిపోర్టును అనుసరించి చెబితే.. అసలు ఈ స్కామ్ ద్వారా ఎలాంటి తప్పిదాలు జరిగాయో చూస్తే.. పెద్ద పెద్ద బ్రాండ్లను తప్పించి లోకల్ బ్రాండ్లకు అవకాశమివ్వడం. అది కూడా కిక్ బ్యాక్ ల రూపంలో ఒక మద్యం కేసుకు రూ. 150 నుంచి రూ. 600 వరకూ అమ్మడం. ఇక రెండోది ఈ సొమ్మ బంగారు దుకాణాల వంటి వాటికి రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకూ పంపడం. తప్పుడు జీఎస్టీ ఇన్వాయిస్ ల ద్వారా ఈ మొత్తం డబ్బు రాజ్ కేసిరెడ్డి వయా మిథున్ రెడ్డి ద్వారా జగన్ కి చేరినట్టు గుర్తించడం. వీటితో పాటు పలు రియల్ ఎస్టేట్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా ఈ సొమ్ము యూఎస్, అరబ్ ఎరిమేట్స్ తదితర దేశాల్లోని షెల్ కంపెనీలకు వెళ్లడం. ఇక ఈ స్కాములోని అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్పినట్టు ఈ కల్తి మద్యం ద్వారా.. కొందరు చనిపోవడం.
వీటన్నిటినీ తాము గుర్తించాం కాబట్టే ఇందులో మిథున్ రెడ్డి వంటి వారి పాత్రను గమనించగలిగాం కాబట్టే తామిలాంటి అరెస్టులు చేయాల్సి వస్తోందని అంటుంది సిట్. అంతే కాదు ఛార్జ్ షీట్ లో జగన్ పేరు పదే పదే ప్రస్తావించిందీ దర్యాప్తు బృందం. అసలీ మొత్తం వ్యవహారం.. పార్లమెంటులో చర్చించదగినది అంటారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు.
అయితే మిథున్ జగన్ కి సన్నిహితుడు కాబట్టే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల తరఫు వాయిస్ వినిపించే వారి నోరు నొక్కడమేనంటారు జగన్. కానీ ఇక్కడింత మేటర్ పెట్టుకుని పైపై రాజకీయ కామెంట్లు చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదంటారు విచారణాధికారులు. మరి చూడాలి.. ఈ లిక్కర్ స్టోరీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.