మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ కు ముద్రగడ ఎయిర్ లిఫ్ట్
posted on Jul 21, 2025 10:21AM

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆయనను హైదరాబాద్ లోని యశోదా అస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముద్రగడ ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (జులై 19) ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అప్పుడే భావించినప్పటికీ, సామర్లకోటలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు డయాలసిస్ చేసిన తరువాత కొంత కోలుకున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం (జులై 20) ఆయన కుమారుడు శశి తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆయన పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రికి ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయనను తొలుత రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరంకు తీసుకువచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ కుఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుస్తున్నారు.
ఇలా ఉండగా ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి ఆరోగ్యం విషయం తెలిసిన వెంటనే ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారు. తండ్రిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రాంతి రావడంపై ముద్రగడ శశి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రాంతిని ముద్రగడ వద్దకు పంపించడంపై శశి ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ తన తండ్రివద్దకు పంపవద్దని ఆదేశించినా వారు వినకపోవడంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా ముద్రగడ కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తన సోదరుడు శశి తండ్రి ముద్రగడకు సరైన వైద్య చికిత్స అందించడం లేదంటూ క్రాంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రాంతి ముద్రగడను పరామర్శించడంపై శశి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.