కాంగ్రెస్ పార్టీకి కేవలం సీబీఐపై మాత్రమే అదుపుంది: మోడీ
posted on Oct 1, 2013 1:45PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ తన పెంపుడు చిలుకలయిన సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖలను ప్రయోగించి తన రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టి, బెదిరించి లొంగదీసుకొంటుందని కేవలం బీజేపీయే కాక యూపీయే ప్రభుత్వానికి బయటనుండి మద్దతు ఇస్తున్నమాయావతి, ములాయం సింగ్ తదితరులు కూడా ఆరోపిస్తుంటారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ ఇంటిపై కూడా గత ఏడాది కాలంగా సీబీఐ చిలుకలు వాలి చాల హడావుడి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తనను సీబీఐ, ఈడీ, లేదా మరే పెంపుడు చిలుకలు భయపెట్టి లొంగదీసుకోలేవని మోడీ అన్నారు.
నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొనాదానికి ముంబై వచ్చిన మోడీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ “యూపీఏ ప్రభుత్వం నానాటికి పతనమవుతున్న రూపాయి విలువ పడిపోకుండా చర్యలు తీసుకొంటానని చెపుతుంది, కానీ రూపాయి పతనం ఆగలేదు. కారణం దానికి దేశంలో ఏ సంస్థపైన పట్టు అదుపు లేదు. కానీ సీబీఐ, ఈడీ, ఆదాయ శాఖల వంటి వాటిపై మీద మాత్రం పూర్తి పట్టు ఉంది. నాతో ఎవరెవరు ఫోటోలు దిగుతున్నారు, ఎవెరవరు కలుస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు దండలు వేస్తున్నారు వంటి వివరాలన్నీ ఉన్నవీడియోలను తెప్పించుకొని చూస్తూ వారిపైకి సీబీఐ, ఆదాయశాఖలను ఉసిగొల్పుతుంది. అయితే నేను ఇటువంటి వాటికి ఎంత మాత్రం భయపడను. నాపైకి సీబీఐని ఉసిగొల్పి నన్ను భయపెట్టి లొంగ దీసుకోవాలని ప్రయత్నించినా నేను భయపడను, లొంగను,” అని మోడీ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్ననరేంద్ర మోడీకే ఈ బాధలు తప్పకపోతే, ఇక మిగిలిన వారి సంగతేమిటి?