వైసీపీ చొక్కాలు వేసుకుంటే బెటర్.. గుంటూరు పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ 

గుంటూరు జిల్లాలో టీడీపీ మహిళా నాయకురాలు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంపై దుమారం రేగుతోంది. వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గం కావడం వల్లే పోలీసులు నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.  ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై  దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు.

'రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయం. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా...ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద గారి కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకమాట .. ఆ దాడిలో ఒక ఎస్సైకి కూడా గాయాలు అయ్యాయి.. యథావిధిగా వైకాపా మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు?' అంటూ  సెటైర్లు వేశారు నారా లోకేశ్.

టీడీపీ శ్రేణుల‌పై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ సీనియర్ నేత  ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపించారు. పోలీసులు ఖాళీ డ్ర‌స్సు విప్పేసి వైసీపీ చొక్కాలు వేసుకుంటూ బాగుంటుంద‌ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆ ప్రాంతంలో విచ్చ‌ల‌విడిగా పేకాట శిబిరాలు ఉంటున్నాయ‌ని, గుట్కా వ్యాపారాలు కొన‌సాగుతున్నాయని అన్నారు. గుంటూరు జిల్లాలో గంజాయి దొర‌క‌ని ప్రాంత‌మంటూ ఏదీ లేద‌ని దూళిపాళ్ల ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుంటూరులో ఫ్యాక్ష‌న్ మూక‌లు రెచ్చిపోతున్నప్ప‌టికీ, పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హిస్తూ చూస్తూ ఊరుకుంటున్నార‌ని మండిపడ్డారు. కొప్ప‌ర్రులో టీడీపీ నాయ‌కురాలిపై దాడికి పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నరేంద్ర డిమాండ్ చేశారు.