కర్నూలు జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తున్న టీడీపీ..!

కర్నూలు జిల్లా..వైఎస్ కుటుంబానికి ఉన్న కంచుకోట్లో ఒకటి. కడప జిల్లా వైఎస్ రాజ్యమైతే.. కర్నూలు జిల్లా సామంత రాజ్యం. వైఎస్ హయాంలోను, జగన్ హయాంలోనూ ఈ జిల్లా ప్రజలు వారికే పట్టంగట్టారు. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది.

 

అయితే ఎన్నికల జరిగిన కొద్ది రోజుల్లోనే నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ తర్వాత జగన్‌ని వ్యూహత్మకంగా దెబ్బ కొట్టాలని భావించిన టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ఈ జిల్లాలోంచే స్టార్ట్ చేసింది. వైసీపీలో కీలకంగా వ్యహరించిన నంద్యాల శాసనసభ్యుడు భూమానాగిరెడ్డి తన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చకండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కోడుమూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన మణిగాంధీ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో టీడీపీ బలం మూడు నుంచి ఆరుకి చేరుకుంది.

 

అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి కూడా సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎస్‌వి మోహన్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు తెర వెనుక భూమా మంత్రాంగం నడిపినట్టు తెలుస్తుంది. ఎందుకుంటే మోహన్‌రెడ్డి భూమాకు సమీప బంధువు. ఆయనతోపాటే నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా తెలుగుదేశంలో చేరే అవకాశాలున్నాయని లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ సామ్రాజ్యాన్ని టీడీపీ ఆక్రమిస్తోంది. తన కళ్లేదుటే కంచుకోటలకు బీటలు వారుతుండటంతో జగన్‌కి ఏమి పాలుపోవడం లేదు.