ఆ విషయంలో చంద్రులది ఒకేమాట..!

ఏపీ తెలంగాణల్లో అధికార పక్షాల ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నారు. మరో పక్క బయటివారు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. బయటిపోరు కన్నా ఇంటి పోరు ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త స్కెచ్ గీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో విభేదించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ఒక విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. అదే నియోజకవర్గాల పెంపు. తెలుగు రాష్ట్రాల తరపున ఢిల్లీలోపెద్ద దిక్కుగా ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఈ మేరకు చంద్రులిద్దరూ మంతనాలు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రంపైనా ఒత్తిడి
తెస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26లోని అర్టికల్ 170లో ఉన్న నిబంధనల మేరకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చని ఉంది. అయితే అర్టికల్ 170 ప్రకారం 2026 వరకు దేశంలోని ఏ రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల పెంచకూడదు. దీనితో తెలంగాణ, ఏపీల్లో సీట్ల సంఖ్య పెంచకూడదని ఎన్నికల కమీషన్ కేంద్రానికి సూచించింది. అయినా చంద్రులిద్దరి టార్గెట్ ఒక్కటే తమకు కనుచూపు మేరల్లో ప్రతిపక్షం ఉండకూడదు. అందుకోసం ఇరు రాష్ట్రాల్లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. కొత్తవారిని చేర్చేకోవాలంటే వారికి ఎదో ఒక ఎర వేయ్యాలి . దానితో పాటు సొంతపార్టీలోనూ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి. అందుకే అసెంబ్లీ స్థానాలను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వెంకయ్య హోం, న్యాయశాఖ ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారంపై చర్చించారు. న్యాయనిపుణుల నుంచి లీగల్ ఓపినీయన్ తీసుకున్న తర్వాత విభజన చట్టాన్ని సవరింపజేయాలని వెంకయ్య నిర్ణయానికి వచ్చారు.

 

విభజన చట్టంలోని సెక్షన్ 26లో SUBJECT TO THE ARTICLE 170 కి బదులు NOT WITHSTANDING TO ARTICLE 170 అన్న పదాన్ని చేరిస్తే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచవచ్చని న్యాయనిపుణులు సూచించారు.  NOT WITHSTANDING అంటే అర్టికల్ 170లో ఎలా ఉన్నా సరే అని అర్ధం. అంటే అర్టికల్ 170తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచవచ్చన్న మాట. సవరణకు సంబంధించిన బిల్లు న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అటార్నీ జనరల్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. న్యాయశాఖ నుంచి హోంశాఖకు అక్కడి నుంచి కేంద్ర కేబినెట్‌కు ఈ బిల్లు చేరుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తమ పంతాన్ని నెగ్గించుకోవటానికి చంద్రులు ఏకంగా బిల్లునే సవరిస్తున్నారు.