అనుకున్నదొకటి.. అయ్యిందొకటి...
posted on Dec 6, 2014 8:17PM

విధి ఎంత బలీయమైనదన్న విషయం మానవమాత్రులకు నిరంతరం తెలుస్తూనే వుంటుంది. నందమూరి కుటుంబానికి సంభవించిన విషాద సంఘటన కూడా విధి ఆడే వింత నాటకంలో ఒక భాగంగానే భావించాలి. నల్గొండ జిల్లా మునగాల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నిజానికి ఆదివారం నాడు నందమూరి కుటుంబం మొత్తం ఒక వేడుకలో కలవాల్సి వుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ చిత్రం ఆడియో వేడుక ఆదివారం నాడు జరగనుంది. ఈ సినిమా ఆడియో వేడుకకు హాజరు కావడానికి నందమూరి కుటుంబ సభ్యులందరితోపాటు నందమూరి జానకిరామ్ కూడా సిద్ధమవుతున్నారు. ఫంక్షన్ ప్రారంభమయ్యేలోపు రాజమండ్రికి వెళ్ళి రావాలన్న ఉద్దేశంతో ఆయన కారులో బయల్దేరారు. ఇంతలోనే ఈ ఘోర సంఘటన జరిగింది. ఆనందోత్సాహాలతో జరిగే వేడుకలో నందమూరి కుటుంబం మొత్తం కలవాలని అనుకుంటే... ఇప్పుడు నందమూరి జానకిరామ్ మరణించడంతో అత్యంత విషాదభరిత సందర్భంలో నందమూరి కుటుంబ కలుస్తోంది..