విధినిర్వహణలో భాగంగా 500 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్

నాన్సీ గ్రేస్ అగస్టా వేక్
(30 ఆగస్టు 1912- 7 ఆగస్టు 2011)

పట్టుదల, విధినిర్వాహణలో అంకితభావం ఉన్నవారిని అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఒక మహిళా అధికారి తాను అందజేయాల్సిన సమాచారం  అందించడానికి ఏకంగా ఐదువందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించడం ఆమెకు తన వృత్తి పట్ల ఉన్న అంకిత భావానికి  తార్కణం. ఆ మహిళా అధికారి నాన్సీగ్రేస్.  రెండో ప్రపంచయుద్ధ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెడల్స్ అందుకున్న ధైర్యశాలి. ఆమె జీవితచరిత్రను పుస్తకరూపంలోకి ప్రముఖ రచయతలు తీసుకువచ్చారు.

 

న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లోని రోసెనాథ్‌లో 30 ఆగస్టు 1912లో నాన్సీ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎల్లావేక్, చార్లెస్ ఆగస్టన్. ఆరుగురు పిల్లల్లో చిన్నది నాన్సీ. వారి కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లి ఉత్తరసిడ్నిలో స్థిరపడింది.

 

సిడ్నీలోని హోస్ హోల్డ్ ఆర్ట్స్ పాఠశాలలో చదువుకున్న నాన్సీ 16ఏండ్ల వయసులోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి నర్సు గా చేరారు. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళింది. అటు నుంచి లండన్ వెళ్ళి అక్కడ జర్నలిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నారు. 1930లో పారిస్ లో యూరోపియన్ కరస్పాండెంట్ గా హార్ట్స్ పత్రికలో ఆమె పనిచేశారు. పత్రికల్లో వచ్చే హిట్లర్ గురించి, నాజీ ఉద్యమం గురించి చదివి స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ లో చేరి అనేక కార్యక్రమాల్లో శిక్షణ పొందారు. 1944లో జాన్ హింద్ ఫార్మర్ గా శిక్షణ పొందిన ఆమె ప్యారాచూట్ ద్వారా ఫ్రాన్స్ లో ప్రవేశించారు.

 

స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించడానికి ఎంతో కష్టపడేవారు. అప్పట్లో రేడియో ద్వారా మాత్రమే సమాచారాన్ని పంపించే వీలు ఉండేది. ఒకసారి దాదాపు 500కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి తాను సేకరించిన సమాచారాన్ని లండన్ కు పంపించారు. ఇందుకోసం ఆమె 72గంటలు కష్టపడ్డారు. అమెకు కొంతమంది జర్మన్లు సహకారం అందించారు. యుద్ధం తర్వాత ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ గా నియమించబడ్డారు. అంతేకాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, యుకె దేశాల నుంచి అవార్జులు అందుకున్నారు. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ మ్యూజియంలో ఆమె అందుకున్న  పతకాలన్ని భద్రపరిచారు. 

 

ఆస్ట్రేలియా ప్రముఖ రచయిత రస్సెల్ బ్రాడ్డాన్ నాన్సీ వేక్ జీవితకథ ఆధారంగా ది స్టోరీ ఆఫా ఎ వేరీబ్రేవ్ ఉమెన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ఆమె ది వైట్ మౌస్ పేరుతో బయోగ్రఫీ రాసుకున్నారు. మరో ఆస్ట్రేలియా రచయిత పీటర్ ఫిట్జ్ సిమోన్స్ ఎ బయోగ్రఫీ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ వార్ హీరోయిన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ధైర్యశాలిగా పేరుగాంచిన నాన్సీ తన 99వ ఏటా 7 ఆగస్టు 2011లో మరణించారు.