నల్లారి ఎక్కడున్నా అంతేనా?
posted on Jun 7, 2023 12:00PM
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఏపీ రాజకీయాలలో గట్టిగానే వినిపించింది. పేరైతే వినిపించింది కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ విభజనను వ్యతిరేకించారు. అప్పట్లో సొంత పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి మరీ హస్తినలో విభజనకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. బెర్లిన గోడ కూల్చేసిన సందర్భంగా అందుకు సంబంధించిన అవశేషం అంటే ఓ రాయి ముక్కను చూపించి.. ఏపీ విభజన జరిగినా మళ్లీ రెండు రాష్ట్రాలూ కలిసిపోవడమే జరుగుతుందంటూ అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగాలు కూడా చేశారు. అయితే విభజనను అడ్డుకోవడంలో విఫలమై.. కాంగ్రెస్ నుంచి వీడి సమైక్య ఆంధ్రప్రదేశ్ పేర సొంత పార్టీ పెట్టుకుని 2014 ఎన్నికలలో పోటీ చేశారు. ఘోర పరాజయం పాలయ్యారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరూ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇది పాత సంగతే. ఇక ప్రస్తుతానికి వస్తే.. 2014 ఎన్నికల పరాజయం తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా రాజకీయ అజ్ణాత వాసం చేశారు. ఆ తరువాత తన సమైక్య ఆంధ్ర పార్టీ గురించి ప్రస్తావించకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హస్తిన వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక రాజకీయంగా ఆయన క్రియాశీలం అవుతారని అప్పట్లో అంతా భావించారు. కానీ ఆయన మాత్రం అజ్ణాతాన్ని వీడలేదు. తాజాగా ఇటీవల ఆయన కమలం గూటికి చేరారు. ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను బీజేపీ ఆయనకు అప్పగిస్తుందని అప్పట్లో అంతా భావించారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ జరగలేదు. పోలీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయినా బీజేపీ కార్యక్రమాలలో ఏమైనా చురుకుగా పాల్గొంటున్నారా అంటే అదేమీ లేదు. పార్టీలో చేరినా ఇప్పటి వరకూ ఆయన హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కాలు బయటపెట్టిన దాఖలాలు లేవు. మధ్యలో ఏదో విదేశీ పర్యటన అంటూ వెళ్లారనీ, తిరిగి వచ్చిన తరువాత తడాఖా చూపుతారనీ వార్తలు వచ్చాయి. కానీ అదీ జరగలేదు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా హైదరాబాద్ లోని నల్లారి కిరణ్ నివాసానికి వెళ్లి కేంద్రంలో మోడీ సర్కార్ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా కోరినా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి స్పందన లేదని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఆయన భాష మౌనమేననీ, ఆయన అజ్ణాత వాసేననీ సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హఠాత్తుగా ఆయనను సోము వీర్రాజు హైదరాబాద్ ఇంట్లో కలిసి మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తున్నామని.. తమకు కూడా రావాలని ఆహ్వానించారు. అయితే కిరణ్ రెడ్డి మాత్రం హైకమాండ్ ఎలాంటి బాధ్యతలిచ్చినా చేస్తానని రొటీన్ డైలాగ్ చెప్పి పంపేశారు. ఆయన ఉద్దేశం.. హైకమాండ్ తనకు అర్జంట్ గా ఏదో ఓ పదవి ప్రకటించడం. కానీ కిరణ్ గురించి పట్టించుకునే తీరికలో ప్రస్తుతం హైకమాండ్ లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సొంత పార్టీపెట్టుకుని కొన్నాళ్ల తర్తా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలా చేరిన తర్వాత ఆయన బయట కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిపోయారు. ఆయన పార్టీలో చేరినప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆయన పాత్ర దగ్గర్నుంచి చాలా ప్రచారాలు జరిగాయి. కానీ జరిగింది మాత్రం శూన్యం. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో దక్షిణాదిన బీజేపీ పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ నిర్ణయాల విషయంలో తననే కామెడీ చేసుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఏపీలో జనంలోకి వెళ్లేందుకు మాత్రం ఆయన వెనుకడుగు వేస్తున్నారు. బీజేపీ తరపున ప్రచారానికి కూడా సిద్ధపడటం లేదు. పైగా ఏపీ బీజేపీలో ఉన్న వర్గాల కారణంగా ఆయనను కలుపుకునిపోవడం కూడా డౌటే. హైకమాండ్ సూచనల మేరకు సోము వీర్రాజు కలిసి ఉంటారని.. వాస్తవంగా అయితే ఆయన కూడా పట్టించుకోరని అంటున్నారు.