తెలంగాణలో పొత్తు ఖరారైనట్లేనా?

ఒక్క భేటీ తెలంగాణలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందా? ఒక్క భేటీ తెలంగాణలో  తెలుగుదేశం ప్రాధాన్యతను, ప్రాముఖ్యతనూ అమాంతంగా పెంచేసిందా? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిష్టను, బలాన్ని మరోసారి రాజకీయ తెరపైకి బలంగా తీసుకువచ్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జరిపిన భేటీ తెలంగాణలో తెలుగుదేశం ప్రతిష్టను అమాంతంగా పెంచేసింది.

ఆ భేటీలో చంద్రబాబుతో బీజేపీ అగ్రనేతలు ఏం చర్చంచారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణలో తగ్గిన బీజేపీ జోష్ ను కాంపన్ సేట్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీతో కలిసి నడవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని మాత్రం  బీజేపీ హై కమాండ్ గుర్తించిందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  చంద్రబాబుతో అమిత్ షా, నడ్డాల భేటీకి ఈ నేపథ్యమే కారణమని చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి వెళ్లేందుకు బీజేపీ హై కమాండ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసిందని అంటున్నారు.

అందుకోసమే ప్రత్యేకంగా చంద్రబాబును హస్తినకు పిలిపించుకుని మరీ చర్చించారని అంటున్నారు. ఈ భేటీపై పరిశీలకులు కూడా ఉభయ తారకంగా ఇరు పార్టీల మధ్యా ఏదో ఒప్పందం కుదిరే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో  బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉన్నట్లుగా, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం ఏమంత లేదు. అదీ గాక ఆ పార్టీకి ఎంత దూరంగా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీకి అంత ప్రయోజనం చేకూరే పరిస్థితులు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో ఎన్నికల సమయంలో వైసీపీ అరాచక మూకలు చెలరేగిపోతాయన్న అనుమానాలు ప్రస్తుతం ఏపీలో బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఏపీలో బీజేపీ తటస్థంగా ఉంటే.. తెలంగాణలో ఆ పార్టీకి మద్దతుపై తనకు అభ్యంతరం లేదన్న ప్రస్తావన తెచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.

పరిశీలకుల విశ్లేషణలకు తగ్గట్టుగానే భేటీ అనంతరం రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ కు వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ తెలంగాణ కీలక నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం హస్తినకు పిలిచింది. వాస్తవానికి తెలంగాణ అర్బన్ ప్రాంతాలలో బీజేపీకి కొంత పట్టు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుకులాడుకోవలసిన పరిస్థితిలోనే ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి తెలంగాణలో తెలుగుదేశం వంటి బలమైన పార్టీ అండ అవసరం. అందుకే చంద్రబాబు ప్రతిపాదనకు బీజేపీ హై కమాండ్ సానుకూలంగా స్పందించే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ తరువాతే తెలుగుదేశం, బీజేపీలలో చర్చల ప్రక్రియ జోరందుకుంది. ఇరు పార్టీల రాష్ట్ర నాయకులూ కూడా క్యాడర్ తో, జిల్లాల నాయకత్వంతో చర్చలు షురూ చేశారు. దీంతో తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశంల మధ్య సయేధ్య కుదిరినట్లేనని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu