బీహార్ రాజకీయాల్లో ధన్‌ఖడ్ దుమారం!
posted on Jul 23, 2025 12:08PM

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా దేశ వ్యాప్తంగా సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొనసాగడం కాదు, మరింతగా ఉధృతం అవుతున్నాయి. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. ఓ వంక రాజకీయ విశ్లేషకులు వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తుంటే, మరో వంక రాజకీయ విమర్శల దుమారం రేపుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒక్క జై రామ్ రమేష్ మినహా మరో ముఖ్య నాయకుడు ఎవరూ, ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా అంశం పై స్పందించలేదు. జై రామ్ రమేష్ కూడా.. ధన్‌ఖడ్ రాజీనామాకు ఆరోగ్య సమస్యలు అసలు కారణం కాకపోవచ్చనీ, రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చన్న అనుమానం మాత్రమే వ్యక్త పరిచారు.
అయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో ధన్‌ఖడ్ రాజీనామా రాజకీయ దుమారం రేపుతున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర ఉందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంచలన ఆరోపణ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను మార్చేందుకే ఇలా చేసినట్టు ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తరుల్ ఇస్లామ్ షహీన్ అన్నారు.చాలాకాలంగా నితీష్ కుమార్‌కు ఉద్వాసన చెప్పేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారనీ,ఒక దశలో నితీష్‌ను ఉప ప్రధానిని చేయాలని కేంద్ర మాజీ మంత్రి అశ్వినీకుమార్ చౌబే సూచించారని గుర్తు చేశారు. ఈ దశలో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యత లేని పదవిని ఇచ్చి నితీష్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని బీజేపీ భావిస్తోందన్నారు. అయితే.. ఆర్జేడీ నేత ఆరోపణలను జేడీయూ సీనియర్ నాయకుడు శరవణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీష్ కుమార్ బిహార్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ఇక్కడే ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి సారథ్యం వహిస్తారని, రాష్ట్ర ప్రజలకు మరో ఐదేళ్లు సేవలందిస్తారని చెప్పారు.
అయితే.. ఆర్జేడీ నేత చేసిన ఆరోపణలో నిజం లేక పోలేదు. పాతికేళ్లకు పైగా బీజేపీ బీహార్ ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెట్టుకుంది. అప్పటి నుంచి తమ ఆశలకు అవరోధంగా నిలిచిన నితీష్ కుమార్ అడ్డు తొలిగించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే వుంది. అంతే కాకుండా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ కూటమి విజయం సాధించింది. అయితే.. బీజేపీ కంటే ఐదు ఎక్కువుగా 115 స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీఎ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీయూ కేవలం 43 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మరోవంక 110 స్థానాలకు పోటీచేసిన బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది.అయినా, ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం, బీజేపీ జేడీయూ నేత నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే.. ఈసారి ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరును ప్రటించేందుకు ముందు నుంచి బీజేపీ అభ్యతరం వ్యక్తం చేస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరు ప్రకటించినా, ప్రకటించక పోయినా, ఎన్నికల ఫలితాలు ఎన్డీఎకు అనుకూలంగా వస్తే ముఖ్యమంత్రి కుర్చీని ఎట్టి పరిస్థితిలో వదులుకోరాదని, బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే చర్చ ధన్‌ఖడ్ రాజీనామా ఎపిసోడ్ కంటే ముందు నుంచి సాగుతోంది.
ఈ నేపధ్యంలో.. ధన్‌ఖడ్ రాజీనామా బీజేపీ బీహార్ వ్యూహంలో భాగం అయినా కాకపోయినా వెదుకుతున్న తీగ కాలికి తగిలింది అన్నట్లుగా కలిసొచ్చిన అవకాశాన్ని కమల దళం వినియోగించుకునే అవకాశం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే.. ధన్‌ఖడ్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, బీజేపీ ఎమ్మెల్యే హరిభుషణ్ ఠాకూర్.. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి అయితే.. దేశానికీ, రాష్ట్రానికి కూడా మంచిదని అన్నారు. అలాగే ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉప రాష్ట్రపతి రేసులో నితీష్ ను తెచ్చి నిలబెట్టారు.
అయితే.. ప్రస్తుతానికి అయితే నితీష్ కుమార్ రాజకీయ అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్దంగా లేరు. అలాగే.. జేడీయు కూడా సీట్లు ఓట్లతో సంబంధం లేకుండా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ప్రచారం ప్రారంభించింది. మరో వంక నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని చెప్పకనే చెపుతున్నారు. నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో కోటి ఉద్యగాలు సహా .. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు కురిపిస్తునారు. ఈ నేపధ్యంలో.. ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ బీహార్ వదిలి పోక పోవచ్చని,అంటున్నారు. అంటే బీహార్ ఎన్నికల క్రతువు ముగిసే వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయగలిగితే ఏమో కానీ.. లేదంటే, బీజేపీ ఆశలు మరోమారు ఆవిరి అయినట్లే అంటున్నారు.