మన బతుకుబండి స్టీరింగ్ మనచేతుల్లోని వుంది!

నేనీ మధ్య  నా చిన్నప్పటి ఫ్రెండ్ ని కలవటం జరిగింది.  ఎప్పుడూ చలాకీగా వుండే తాను, ఈమధ్య చాలా డల్ గా తయారైంది. విషయo ఏంటని అడుగుతే, తన భర్త ఉద్యోగ రీత్యా దూరంగా బదిలీ కావటం, పిల్లలు ఎదుగుతున్న, మాట వినకుండా అల్లరి చేయడం , శారీరకమైన మానసికమైన ఒత్తిడి పెరగటం, ఇవన్నీ నా వల్ల కావడం లేదు అని చెప్పుకుంటూ వచ్చింది. మనలో చాలా మంది కి  చాలా సార్లు, పరిస్థితులు గాడి తప్పినపుడల్లా , చీకాకు కలగటం, ఇక నా వల్ల కాదు అన్నట్టు, బాధ , అసహనం కలుగుతూ ఉంటుంది కదా, మరి ఈ పరిస్థితి నుంచి బయటడం ఎలా?

మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి , వంద కిలోమీటర్ల దూరం లో వున్న ఊళ్లో జరిగే కజిన్ పెళ్ళికి వెళ్లాలనుకున్నామనుకోండి, ఆ ఫీలింగ్  మనకు యెంత ఎగజయిట్మెంట్ ఇస్తుంది. పెళ్ళికి అందరూ వస్తారు , అందరిని కలవచ్చు , చాలా చాలా ఎంజాయ్ చేయచ్చు అని బయలుదేరుతాం. కదా.. ఓ రెండు గంటలు ఎక్స్ప్రెస్  హైవే లో నడిపాక, , పల్లెటూరు కి వెళ్లే చిన్న రోడ్డు లోకి టర్నింగ్ తీసుకుంటాం. అప్పటిదాకా హాయిగా డ్రైవ్ చేసిన మనకు, కుదుపులు వున్న కంకర రోడ్డు, రోడ్డు పై అక్కడక్కడా గుంతలు , మధ్యలో కారుకి అడ్డంగా వచ్చే , ఆవులు, మేకలు ఇవన్నీ ఎదురవుతుంటే, మన కారు స్పీయేడు కూడా తగ్గించాల్సి వస్తుంది. అవునా?

ఇది ఎంత అసౌకర్యంగా వున్నా, మన ప్రయాణం కొనసాగిస్తాం. ఎందుకంటె, ఈ చిన్న చిన్న ఇబ్బందులు దాటుకుని గమ్యాన్ని దాటితే అక్కడ యెంత హ్యాపీనెస్ ఉంటుందో మనకు తెలుసు కనుక. అంతే కానీ, రోడ్డు బాగాలేదు, జర్నీ విసుగ్గా వుంది అని వెనక్కి వెళ్లి పోయావాలని ఎన్నడూ అనుకోము. 
మన జీవితం కూడా, అచ్చముగా ఇలాగే ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పుడల్లా , ఈ కుదుపుల ప్రయాణం  తరువాత మళ్ళీ మన బతుకు బండి స్పీడు అందుకుంటుందన్న నమ్మకం ఉండాలి. జీవితం లో ప్రతీ ప్రయాణం, ప్రతీ అనుభవం మనకు కొత్త పాఠాలను నేర్పి, ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి.

అంతే కాదు, ఖాళీ గా, సాఫీ గా వున్నా రోడ్డు మీద నడిపే వాళ్ళు కాదు, ఒడిదొడుకులు వున్న రోడ్డు మీద నడిపేవాళ్ళు అసలు గొప్ప. అంతే కానీ, ఈ గుంతల రోడ్డు లో నడపటం నావల్ల కాదు అని స్టీరింగ్ వదిలేస్తే ఎలా ఉంటుంది? రోడ్డు సాఫీ గ లేనప్పుడే ఇంకాస్త జాగ్రత్తతో , ఒడుపుగా బండి ని నడపాలి. జీవితపు స్టీరింగ్ ని కూడా ఇలాగే ఒడుపుగా తిప్పడం నేర్చుకోవాలి.ఎలాంటి పరిస్థితుల్లోనూ, చేతులెత్తేయకుండా, పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటం మన బాధ్యత. 

జీవితం లో ఎత్తుపల్లాలు ఉంటేనే, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. మన నైపుణ్యం ఏంటో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.  జీవితం లో, సంతోషం  సమస్యలు రెండు కలగలిపి ఉండటం సహజం, అలాంటి పరిస్థుల్లో హాయిగా నెగ్గుకు రావడమే అసలైన విజయం.  అందుకే, సమస్యలు వచ్చినపుడే, అవి మనకు కొత్త విషయాలు నేర్పే మాస్టార్లని , మనలోని ప్రతిభని వెలికి తీసే గురువులని గురుతుంచుకోండి. 

-Bhavana