యూపీలో కరెన్సీ వర్షం కురిపించిన కోతి
posted on Aug 28, 2025 10:07AM

మర్కట చేష్టలకు అర్ధం ఉండదు. ఒక్కోసారి అవి చేసే పనులు వినోదం కలిగిస్తాయి. ఇంకోసారి విస్మయ పరుస్తాయి. అలా విస్మయం కలిగించేలా ఓ కోతి చెట్టెక్కి మరీ నోట్ల వర్షం కురిపించింది. ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దోదాపూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.
ఓటీచర్ టీచర్.. ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం తన వెంటన 80 వేల రూపాయల నగదు కూడా తెచ్చిరు. ఆ నగదును ఓ సంచిలో ఉంచి తన బైక్ డిక్కీలో భద్రపరచుకున్నాడు. ఇక కార్యాలయం వద్ద ఆయన తన పనిలో ఉన్న సమయంలో ఓ కోతి.. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఏకంగా బైక్ డిక్కీ తెరిచి అందులో ఉన్న డబ్బు సంచినీ ఎత్తుకెళ్లి సమీపంలోని చెట్టెక్కి కూర్చుంది.
తీరిగ్గా చెట్టుపై కూర్చుని సంచీని తెరిచి చూసింది. అందులో తాను తినడానికి పనికివచ్చే పదార్ధం ఏదీ లేకపోవడంతో.. కోపగించింది. అంతే తన కోతి చేష్ట చూపింది. సంచీలోని నోట్లను తీసి గాలిలోకి విసిరేయడం ఆరంభించింది. చెట్టు పై నుంచి నోట్లు రాలడంతో జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.