పవన్ కు మోహన్ బాబు కౌంటర్...
posted on May 10, 2017 3:47PM
.jpg)
టీటీడీ ఈవోగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఓ ఐఏఎస్ అధికారి పవన్ ప్రశ్నించిన సంగతి కూడా తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన పవన్ తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని.. తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారి బాధ్యతలు చేపట్టడాన్ని తాను వ్యతిరేకించనని.. కానీ ఉత్తరాదిలోని అమర్‌నాథ్, వారణాసి, మధుర లాంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన వారిని ఎందుకు అధికారులుగా నియమించడం లేదని పవన్ ప్రశ్నించిన సంగతి కూడా విదితమే.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యానించారు మోహన్ బాబు. దీనికి సంబంధించి అనిల్ కుమార్ సింఘాల్ కు ఓ లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. అనిల్ కుమార్ సింఘాల్ సిన్సియర్ అధికారి అని.. వెంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుమూలల ఉన్న హిందువులు ఆరాధిస్తారని, దానికి ప్రాంతంతో సంబంధం లేదని అన్నారు. ఉత్తరాది వ్యక్తిని టీటీడీకి ఈవోగా నియమించడంపై కొందరు వ్యతిరేకిస్తుండడాన్ని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు.
‘‘తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఈవోగా ఎంపికైనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నిజాయతీ, నిబద్ధత, అంకితభావంతో సమాజాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు మీరు సమగ్రంగా పనిచేశారు. అదంతా కూడా విశాఖ పట్నం, మెదక్, తూర్పు గోదావరి జిల్లాలకు కలెక్టరుగా పనిచేసినప్పుడు కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా టీటీడికి ఎంతో పేరుంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత కోసం, భక్తులను సంతోష పరిచేలా కార్యకలాపాలు నిర్వహించడం కోసం సమర్థమైన నాయకత్వం అవసరం. ఆ దిశగా మీరు సమర్థంగా పనిచేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడికి ప్రాంతానికి సంబంధం లేదు. తిరుపతి దక్షిణాదిలోనే ఉన్నా.. ఉత్తారాది వారిని నియమించారని వ్యతిరేకించడం సమంజసం కాదు. ఈ ప్రాంతం వారినే టీటీడీకి ఈవోగా నియమించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. భాష వస్తుందా..? రాదా..? అన్న విషయాన్ని పక్కనపెట్టి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారా..? లేదా..? అన్నదే చూడాలి. కాబట్టి ఇలాంటి పవిత్ర క్షేత్రానికి మిమ్మల్ని ఈవోగా నియమించడాన్ని సమర్థిస్తున్నాను. ఈ దిశగా అందరి తరఫునా మీకు సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నాను’’ అంటూ కొత్త ఈవోకు అనిల్ సింఘాల్‌కు ఆయన లేఖ రాశారు.
మరి మెగా ఫ్యామిలీకి... మెహన్ బాబుకు మధ్య విబేధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పైకి మామూలుగా ఉన్న.. వారిమధ్య విబేధాలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి ఇప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై అది ఇంకోసారి బయటపడిందని అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దాం.