మోడీ, షాలకు ఏపీ గండం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక మేరకు పట్టు సాధించాలంటే.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ఒక్కటే మార్గం అని కమలం అధినేతలు తలపోశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వెనకాల ఉన్నది బీజేపీ వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తమ అధికారం పదిలంగా ఉండాలన్నా.. ఏపీలో తమ పెత్తనం సాగాలన్నా చంద్రబాబును రాజకీయంగా బలహీన పరచడం ఒక్కటే మార్గమని మోడీ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏపీలో జగన్ సర్కార్ అడ్డగోలు విధానాలకూ, పరిమితులకు మించిన అప్పులకూ, నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి సాగిస్తున్న అరెస్టులకు అనుమతులు ఇస్తూ.. ఏపీలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమౌతున్న జగన్ ప్రతిష్టను వేడుక చూస్తున్నట్లు కమలనాథులు చూస్తున్నారని అంటున్నారు. 

అయితే బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కు నివేదికలు అందిస్తుండటంతో.. ఏమో ఎటువైపు పోయి ఎటువైపు వస్తుందోనన్న జంకుతో ఇప్పటి వరకూ తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చింది. అడపాదడపా చంద్రబాబను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ద్వారా పోత్తు అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇవ్వడం, అదే సమయంలో జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులకు సై అంటూ.. ఏపీలో బీజేపీ డ్యుయెల్ రోల్ పాటిస్తూ వచ్చింది. 

అయితే ఎప్పుడైతే స్కిల్ స్కామ్ పేరిట చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ అధినాయకత్వం ఖండించలేదో.. అప్పుడే సర్వులకూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తిగా బోధపడింది. దీంతో ఏపీలో బీజేపీ స్టేక్ పూర్తిగా జీరో అయ్యింది. నోటీతో పోటీపడి గత ఎన్నికలలో తెచ్చుకున్న ఒక శాతం ఓటు కూడా ఈ సారి అనుమానమే అంటున్నారు. 

వాస్తవానికి ఏపీలో తమకు ఉన్నదీ, పోయేదీ ఏమీ లేదని కమలనాథులకు స్పష్టంగా తెలుసు.. అయినా జనసేనానిని మిత్రుడిగా చెప్పుకుంటూ.. ఆయనను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి వెనకుండి డ్రామా నడిపిద్దామనుకున్న కమలం అధినేతలకు తన పయనం తెలుగుదేశంతోనే.. కలిసి వస్తుందా? రాదా? అన్నది బీజేపీ ఇష్టం అంటూ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొటేయడంతో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలూ పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సింగిల్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అంతే కాకుండా.. బీజేపీ ఏతర కూటమి ఇండియా.. సమష్టిగా ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సొంతంగా ఓ పుంజీడు స్థానాలు తెచ్చుకోగలిగిన పార్టీలు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితిది. అందుకే ఏపీలో ఎటు పోయి ఎటు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు తెచ్చుకుని తెలుగుదేశం అధికారంలోకి రావడమే ఖాయంగా అత్యధిక పార్లమెంటు స్థానాలలో కూడా విజయం సాధించి.. కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న పరిశీలకుల విశ్లేషణలు బీజేపీని గాభరాపెడుతున్నాయి. ఆ కారణంగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ సర్కార్ కు వెనుకనుంచి అవసరమైన అండదండలందించిందనీ, ఎన్నికల సమయంలో చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని ముందుండి నడిపించే సారథి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పకడ్బందీగా సమాయత్తం కాలేదనీ, అలాగే బాబు ప్రెజెన్స్ లేకుండా తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల సర్దు బాటు, ఓట్ల బదలీ సజావుగా సాగే అవకాశం ఉండదనీ బీజేపీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే బీజేపీ ఆశించినదానికి భిన్నంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోనూ కూడా ఆందోళనలు మిన్నంటలం, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వెలువడటంతో బీజేపీ కంగుతింది. అన్నిటికీ మించి చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కారు.. ఆయన నిర్దోషిగా, స్వచ్ఛంగా బయటకు వస్తారు అని బీజేపీ సీనియర్ నేత.. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో మోడీ, షాల మౌనం వెనుక ఉన్న కుట్ర కోణం బహిర్గతమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు  ఏపీలో బీజేపీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  రాజకీయ స్వార్థంతో.. ఒక బలమైన పార్టీని బలహీనం చేయాలన్న దురుద్దేశంతో బీజేపీ ఆడిన కుట్ర క్రీడకు ఆ పార్టీయే బలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.