జగన్ నెత్తిన మోడీ పాలు.. ఏకంగా 10,460. 87 కోట్లు ఇచ్చేశారు!
posted on May 23, 2023 10:21AM
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. ఏం చేసినా మిమ్మల్ని ఆదుకోవడానికి కేంద్రంలో మేమున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి.. కొన్ని నెలలపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద రూ.10,460. 87 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అయితే ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. జగన్ సర్కార్ కు అండగా, ఆర్థిక దన్నుగా కేంద్రం ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులు విడుదలైనా అవి విడతల వారీగా కేవలం పప్పు బెల్లాలకు తప్ప మరెందుకూ పనికి రాని విధంగా విడుదల చేసే శారు. ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది అదీ ఆంధ్రప్రదేశ్ కు మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తొలి సారి. అదీ తన ఆర్థిక అరాచకత్వం కారణంగా ఏపీ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో పడిన సమయంలో.. మోడీ సర్కార్ జగన్ పై అపార కరుణ చూపి.. కోరకుండానే ఏకంగా పది వేల 460. 87 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విదిల్చినట్లుగానే విడుదల చేసిన కేంద్రం.. మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల భర్తీపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో.. 2014-15 సంవత్సర వనరుల అంతరానికి (గ్యాప్) సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాల్సి ఉంది.
దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు రూ. 16.078 కోట్లు తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా పరిగణించాలని కోరింది. నాటికి చెల్లించని (పెండింగ్) బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఒకటో తారీకు వస్తే చాలు.. ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి.. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు ఎలా.. ఇబ్బడిముబ్బడిగా ..ప్రకటించిన సంక్షేమ పథకాలకు నిధులు ఎలా తేవాలని .. సతమతమైయ్యే జగన్ ప్రభుత్వానికి ..కేంద్రం మంజూరు చేసిన నిధులు..ఎంతో ఊరటను ఇస్తాయి. నిధుల కోసం కాళ్లరిగేలా తిరిగిన చంద్రబాబును పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ఇలా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దత్తపుత్రుడు జగన్ ను ఆదుకునేందుకు మోడీ ఉదారంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.