ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

ఏపీలో అరాచకత్వం శ్వైర విహారం చేస్తోందా? పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను నిలువరించడంలో విఫలమైన ఏపీ పోలీసులు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కేంద్ర దర్యాప్తు బృందం కోరినా సహకారం అందించకుండా అధికార పార్టీకి కొమ్ము కాసి మాయని మచ్చను మిగుల్చుకున్నారు. సీబీఐకి ఏపీ పోలీసులు సహకారం అందించకపోవడమే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ కోరినా, అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే కర్నూలులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనీ, కంట్రోల్ చేయడం తమ వల్ల కాదనీ చేతులెత్తేయడంతో ఏపీ పోలీస్ ప్రతిష్ట మంటగలిసింది.

 ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సెక్షన్ 30, సెక్షన్ 144 పేరిట ఆంక్షలు విధించి ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టనీయకుండా నిర్బంధాలు అమలు చేసే పోలీసులు.. ఒక హత్య కేసు నిందితుడికి రక్షణ కవచంలా నిలబడటం, సీబీఐని ఆ సమీపంలోకి రాకుండా మోహరించిన ఆయన అనుచరుల్ని  అక్కడి నుంచి మాత్రం చెదరగొట్టడం అటుంచి వారి అడుగులకు మడుగులొత్తుతున్న విధంగా వ్యవహరించడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో పోలీసు శాఖకు జీతం ఇస్తున్నది ప్రభుత్వమా? లేక అధికార వైసీపీ పార్టీయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  

అవినాష్ అనుచరులు, వైకాపా కార్యకర్తలు మీడియాపైన దాడులు చేస్తూ, కెమెరాలు ధ్వంసం చేస్తూ, అల్లర్లకు, దౌర్జన్యానికి తెగబడుతున్నా ప్రేక్షక పాత్ర వహించిన పోలీసుల తీరు చూస్తుంటే.. ఏపీలో అరాచకత్వం రాజ్యమేలుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు ఆందోళన చేయటంతో ఆ సందులోని దాదాపు పది ఆసుపత్రులు, క్లినిక్ కు వచ్చే వందల మంది రోగులు, వారి బంధువులు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. 


జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. కర్నూలు నగరంలోనే 5 పోలీసుస్టేషన్లు, చుట్టుపక్కల మరో 15 వరకూ పోలీసు స్టేషన్లున్నాయి. ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్ సిబ్బంది ఉంటారు. కర్నూలు నడిబొడ్డున ఏపీఎస్సీ బెటాలియన్ కూడా ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగానే బలగాల్ని రప్పించొచ్చు. కనీసం రెండు, మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ చాలా సులువుగా తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రి వద్ద అల్లర్లు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. అందులోనూ కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్. అటువంటి ఆయన.. అవినాష్ రెడ్డి నీడను తాకినా శాంతి భద్రతలకు విఘాతం కులుగుతుంది.. తాము నియంత్రించలేమని చేతులెత్తేశారంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందో అవగతం చేసుకోవచ్చు. సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్ పై మచ్చ పడుతుందని తెలిసి కూడా కర్నూలు ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయనపై ఒత్తిడి ఏస్థాయిలో ఉందో ఇట్టే అవగతమౌతుంది.  

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్ లో నెలకొన్న పరిస్థితుల్ని తలదన్నేలో జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu