మోదీ @75.. వాట్ నెక్స్ట్?

సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు.  దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు.  ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అలాగే బీజేపీ రక్తదాన శిబిరాల వంటి  సేవా కార్యక్రమాలు నిర్వహించినా నిర్వహించవచ్చు. అంతేనా అంటే బీజేపీ ముఖ్యనాయకుల నుంచి అంతే అనే సమాధానం వస్తోంది. 

నిజంగా అంతే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  కానీ..  మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. అంటే గత పదేళ్లుగా జరుగుతున్నది అంతే కావచ్చు. కానీ..  ప్రధానిగా మోదీ జరుపుకునే  11వ పుట్టిన రోజుకు అంతకు మించిన ప్రత్యేకత, ప్రాధాన్యతా ఉంది. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీకి, 2025 సెప్టెంబర్ 17న 75 వంతాలు నిండుతాయి. ఆయన 76వ  వసంతంలోకి అడుగు పెడతారు. అంటేజజ  బీజేపీ అప్రకటిత  పదవీ విరమణ వయోపరిమితి  నియమం ప్రకారం అదే రోజున ప్రధాని మోదీ పదవీ విరమణ చేయవలసి ఉంటుంది.  అంటే రాజీనామా చేయవలసి ఉంటుంది.  

అయితే.. బీజేపీ నాయకత్వం ఇప్పటికే  పార్టీ రాజ్యాంగంలో వయో పరిమితి నియమం ఏదీ లేదని ఒకటికి పది సార్లు స్పష్టం చేసింది. అలాగే.. మోదీ ఈ ఐదేళ్లే కాదు ఆ పై ఐదేళ్ళు (2029-2034) కూడా పదవిలో కొనసాగుతారని అమిత్ షా  సహా సీనియర్ నాయకులు వేర్వేరు సందర్భాలలో స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ అగ్ర నేతలు  అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా.. వయోపరిమితి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని.. నిజానికి, అప్పట్లో 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించింది కూడా  మోదీనే కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. స్వయంగా ఆయనే తీసుకువచ్చిన నియమాన్ని, నిబంధనను ఆయనే ఉల్లంగిస్తే ఎలా అనే ప్రశ్న కూడా   తెరపైకి వస్తూనే వుంది. అయినా..  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఇంత వరకు మోదీ రిటైర్మెంట్  గురించి సీరియస్  చర్చ జరిగిన సందర్భాలు లేవు. నిజానికి, ఇంతవరకు   ప్రధాని  మార్పు   సంకేతాలు రాజకీయ వాతావరణంలో  సంకేత మాత్రంగా అయినా కనిపించడం లేదు. 

కానీ..  వారో వీరో ఇంకెవరో కాకుండా..  ఏకంగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ఆర్ఎస్ఎస్  సర్ సంఘ చాలక్ మోహన్‌ భాగవత్‌’ వయోపరిమితి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నెల 9న  నాగాపూర్ లో సంఘ్ ప్రచారక్  మోరో పంత్ పింగ్లే  జీవిత చరిత్ర, పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ..  భాగవత్  రిటైర్మెంట్  ప్రస్తావన తెచ్చారు. ఎప్పుడో, మోరో పంత్ పింగ్లే  తన 75 వ పుట్టిన రోజు నాడు నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే.. ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకు జరుగు, మమ్మల్ని చేయనివ్వు అనే దాని అర్థం  అంటూ చేసిన సరదా వ్యాఖ్యను, మోహన్‌ భాగవత్‌  తనదైన శైలిలో ప్రముఖంగా ప్రస్తావించారు.

 75 ఏళ్లు ఒంటిమీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే.. వయసు మీరిందనీ,  బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి  అని పింగ్లే అనేవారని చెప్పారు. 
నిజానికి, మోదీ కంటే ఓ ఆరు రోజులు ముందే అంటే సెప్టెంబర్ 11న తన  75 పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్‌ భాగవత్‌ తన  రిటైర్మెంట్  గురించే వ్యాఖ్య చేశారో.. లేక మోదీకి రిటైర్మెంట్   సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికే ఆయన ఆ వ్యాఖ్య చేశారో తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య  రాజకీయ, మీడియా వర్గాల్లో   సంచలనంగా మారింది. 

ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  ఆర్ఎస్ఎస్ అధినేత  ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోవలసిన సమయం వచ్చేసిందని పరోక్ష సంకేతం అందించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అద్వానీ, జోషీ, జస్వంత్‌ సింగ్‌లకు వర్తించిన నియమం  మోదీ కి ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు.  అయితే..  విపక్షాల విషయం ఎలా ఉన్నా మోదీ రిటైర్మెంట్  తీసుకునే అవకాశం ఉందా  అంటే..  అలాంటి ఆలోచనే లేదని, బీజేపీ  వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్‌ఎ్‌సఎస్‌  కీలక నేత దిలీప్‌ దేవధర్‌ కూడా అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మోహన్‌ భాగవత్‌ వివరణ ఇచ్చారని దిలీప్‌ దేవధర్‌ గుర్తుచేశారు. 

అయితే..  కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ, పదేళ్ళలో తొలిసారిగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి  మోహన్ భాగవత్ సహా సంఘ్ పెద్దలతో ఏకాంత సమావేశాలు నిర్వహించారు. అప్పట్లోనే మోదీ రిటైర్మెంట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపధ్యంలో, మోహన్ భాగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే..  సెప్టెంబర్ 17 తర్వాత, ఏమి జరుగుతుంది,అంటే.. సంఘ్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు  సెప్టెంబర్ 17 తర్వాత ఏమి జరుగుతుంది ..సెప్టెంబర్ 18 వస్తుంది.. అంతకు మించి మరో మార్పు ఉండదని సెటైర్ వేశారు.  అయినా, సెప్టెంబర్ 17 వచ్చి పోయేవరకు  ఈ సస్పెన్స్ కొనసాగేలానే వుందని అంటున్నారు.