తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
posted on Aug 17, 2025 9:27AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విషాద దృశ్యాలు ఇంకా మరపునకు రాలేదు. అంతలోనే మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ ల్యాండింగులతో విమానయానమంటేనే ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్న వేళ ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెడితే ముంబై విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానం ల్యాండ్ అడుతుండగా విమానం వెనుక భాగం రన్ వేను బలంగా ఢీ కొంది. అయితే పైలట్ల చాకచక్యం వల్ల ఘోర ప్రమాదం తృటిలో తప్పి విమాన ప్రయాణీకులు సురక్షింగా ఉన్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
బ్యాంకాక్ నుంచి 6ఇ 1060 నంబర్ గల ఇండిగో ఎయిర్‌బస్ ఏ321 నియో విమానం శనివారం ముంబై చేరుకుంది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం 3:06 గంటలకు రన్‌వే 27పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కు అవకాశం లేదని భావించిన పైలట్లు విమానాన్ని తిరిగి పైకి లేపే ప్రయత్నంలో విమానం తోక భాగం రన్‌వేకు తగిలింది. దీంతో పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతికూల వాతావరణం కారణంగా గో-అరౌండ్ చేస్తున్నప్పుడు విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం, విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు నిర్వహించి, రెగ్యులేటరీ అనుమతులు పొందాకే తిరిగి సేవలు ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది.