ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా?
posted on Aug 17, 2025 12:03PM
.webp)
మోడీ రిటైర్మెంట్ పై సాగుతున్న చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి చేపట్టిన ఓటు చోరీ ఆందోళన నేపథ్యంలో మరో సారి మరింత బలంగా మోడీ రిటైర్మెంట్ చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ రిటైర్మెంట్ అంశాన్ని వార్తలో నిలిచేలా పదే పదే ప్రస్తావిస్తూ సవాళ్లు విసురుతోంది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీల విషయంలో మోడీ, షా వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ.. 75 ఏళ్ల నిబంధన నుంచి మోడీకి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ ఎద్దేవా చేస్తోంది. వచ్చే నెలతో అంటే సెప్టెంబర్ తో సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. దీంతో బీజేపీ తనంతట తానుగా విధించుకున్ననిబంధన ప్రకారం మోడీ రిటైర్ కావలసి ఉంటుంది.
బీజేపీ పొలిటికల్ మెంటార్ లాంటి ఆర్ఎస్ఎస్ కూడా అదే చెబుతోంది. అయితే పార్టీలోనే మోడీ రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను తెరపైకి తెస్తున్నవారిలో మోడీ ప్రధానిగా కొనసాగాలనుకుంటున్న వారితో పాటు ఆయన వైదొలగాలని కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ కూడా మోడీ ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మోదీ పదవీకాలం సెప్టెంబర్ తర్వాత కొనసాగడం అన్నది ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీజేపీ విధాన నిర్ణయాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమన్నది బహిరంగ రహస్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు లేకుండా మోదీ 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు పొందే అవకాశం ఇసుమంతైనా లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుడ్ లుక్స్ లో పడేందుకు మోడీ శతధా ప్రయత్నిస్తున్నారనడానికి ఆయన ఇటీవలి ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్న విధానమే తార్కనంగా పరిశీలకులు చెబుతున్నారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించడంలో ఆ ఎన్నికల ప్రచారాన్నంతా భుజాలపై వేసుకుని మోసిన మోడీ వైఫల్యం ఆయనను బీజేపీలో బలహీన నేతగా మార్చిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని పదవిలో 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా కొనసాగాలంటే ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడం వినా మరో మార్గం లేదనీ, అందుకే మోడీ ఆ ప్రయత్నాలలో మునిగిపోయారని చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు బలాన్ని కోల్పోయారనీ, గత ఎన్నికలలో పార్టీకి మెజారిటీ సీట్లు సాదించడంలో ఆయన వైఫల్యం ఇప్పుడు ఆయన ముందరి కాళ్లకు బంధంగా మారిందనీ చెబుతున్నారు. ఇక ఆయన సెప్టెంబర్ తరువాత ప్రధానిగా కొనసాగడమన్నది ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో?