మోదీకి ఆ భ‌యం ప‌ట్టుకుందా? తగ్గింది నెగ్గడం కోసమేనా?

ఏడాదిగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తున్నారు. గ‌తంలో ఢిల్లీనీ ముట్ట‌డించారు. ఆక‌లికి అల‌మ‌టించారు. చ‌లికి చ‌నిపోయారు. లాఠీ దెబ్బ‌ల‌తో ఒళ్లు హూనం చేసుకున్నారు. అయినా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే వ‌ర‌కూ త‌గ్గేదే లే.. అంటూ రైతులు ధ‌ర్నాలు చేస్తున్నారు. ఆందోళ‌న చేస్తున్న‌దంతా దేశ‌ద్రోహులంటూ, క‌లిస్తాన్ ఉగ్ర‌వాదులంటూ ఎదురుదాడి చేశారే కానీ, రైతుల‌ను క‌నీసం మ‌నుషులుగా కూడా చూడ‌లేదు కేంద్ర పాల‌కులు. అలాంటిది.. ఇప్పుడు స‌డెన్‌గా.. కార్తీక పౌర్ణ‌మి ఉద‌యాన‌.. స్వ‌యంగా మోదీనే దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌టం.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం.. ప‌నిలో ప‌నిగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌డం.. ఒకింత ఆశ్చ‌ర్య‌మే. మోదీ దిగిరావ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందంటున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు యూపీ, పంజాబ్‌తో స‌హా.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల భ‌య‌మే మోదీ వెన‌క‌డుగు వేసేలా చేసిందంటున్నారు.  

సాగు చట్టాలే కాదు.. ఇటీవ‌ల ఎవ‌రూ అడ‌క్క‌పోయినా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు మోదీ. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో, ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి చావు దెబ్బ తగ‌ల‌డంతో వెంట‌నే న‌ష్ట నివార‌ణకు పెట్రో ధ‌ర‌లు త‌గ్గించార‌ని అన్నారు. ధ‌ర‌ల ప్ర‌భావం రాబోవు ఎన్నిక‌ల్లో ప‌డ‌కుండా అలా కాస్త మేనేజ్ చేశార‌ని భావించారు. పెట్రో రేట్లు త‌గ్గించినా.. కేంద్రంపై, బీజేపీపై ప్ర‌జావ్య‌తిరేక‌త ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నివేదిక‌రు రావ‌డంతో ప్ర‌ధాని మోదీ మ‌రోమెట్టు దిగొచ్చారు. ఏడాదిగా రైతు ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేస్తూ వ‌స్తున్న ప్ర‌భుత్వం.. ఆ రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. ఇలా చేయ‌క‌పోతే వ‌చ్చే ఏడాది తొలినాళ్ల‌లో జ‌ర‌గ‌బోవు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌నిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే భ‌యంతోనే మోదీ ఇలా త‌ల‌వంచార‌ని చెబుతున్నారు. 

దేశంలోకే అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌. అక్క‌డి ఎన్నిక‌ల ప్ర‌భావం ఢిల్లీ రాజ‌కీయాల‌పై తీవ్రంగా ఉంటుంది. సంఖ్యా ప‌రంగా యూపీలో ఎవ‌రిది పైచేయి అయితే.. కేంద్రంలో ఆ పార్టీదే ఆధిప‌త్యం అంటారు. అయితే, ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న బీజేపీని ప్ర‌జాబోనులో దోషిగా నిల‌బెట్టింది. కేంద్ర‌మంత్రి అజ‌య్‌మిశ్రా త‌న‌యుడు ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను కారుతో గుద్దేసి.. 8 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వ‌డంపై అన్ని రాష్ట్రాల‌ రైతులు బీజేపీపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఆ రైతులంతా క‌న్నెర్ర జేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ మాడిమ‌సైపోతుంద‌ని మోదీ భ‌య‌ప‌డిన‌ట్టున్నారు. అందుకే, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గార‌ని భావిస్తున్నారు. 

ఢిల్లీ శివార్ల‌లో దీక్ష చేస్తున్న‌దంతా పంజాబ్ రాష్ట్ర రైతులే. మ‌రికొన్ని నెల‌ల్లోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. యూపీలోనూ ఈసారి అసెంబ్లీ స‌మ‌రం హోరాహోరీగా సాగ‌నుంద‌ని అంటున్నారు. ఇలా పంజాబ్, యూపీలో బీజేపీకి వ్య‌తిరేక గాలులు వీస్తుండ‌టం.. ప్ర‌ధానంగా రైతుల వ‌ల్లే భారీ న‌ష్టం రానుంద‌ని నివేదిక‌లు చెబుతుండ‌టంతో.. మోదీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లకు దిగార‌ని తెలుస్తోంది. యూపీ, పంజాబ్ ఎన్నిక‌ల భ‌యంతోనే అర్జెంటుగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. ఏడాదిగా ఎంత ఉధృతంగా రైతులు ఉద్య‌మిస్తున్నా ఏమాత్రం క‌నిక‌రం చూప‌ని కేంద్రం.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన మూడు చ‌ట్టాల‌ను తూచ్ అంటూ తీసిపారేయ‌డం.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అనేందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గెలిచింది రైతులు కాదు.. ఎన్నిక‌లు-ఓట‌ర్లు మాత్ర‌మే.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu